లెక్కల్లోనే తగ్గిన పేదరికం | India Poverty Reduction World Bank Report | Sakshi
Sakshi News home page

లెక్కల్లోనే తగ్గిన పేదరికం

Nov 24 2026 8:24 AM | Updated on Nov 24 2026 8:24 AM

India Poverty Reduction World Bank Report

ఇన్‌ బాక్స్‌

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ అని ఐఎంఎఫ్, రాబోయే 25 ఏళ్లలో అమెరికాను వెనుకకు నెట్టి ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని అమెరికన్‌ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్‌ చెబుతున్న నేపథ్యంలో ‘భారత దేశంలో పేదరికం–సమానత్వం’ పేరుతో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రాముఖ్యం సంతరించుకుంది.

గత 12 ఏళ్లలో దేశంలో 49.6 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు; 2011 నుండి 2023 మధ్యకాలంలో తీవ్ర పేదరికం 27.1 శాతం నుండి 2.6 శాతానికి, మధ్యస్థ పేదరికం 57.7 శాతం నుండి 16.1 శాతానికి తగ్గింది; ఇది 2028 నాటికి 12.1 శాతానికి తగ్గుతుందని వరల్డ్‌ బ్యాంక్‌ తన నివేదికలో వెల్లడించింది. ప్రజల వినియోగ వృద్ధి, గడ చిన ఆరేళ్లలో 13.4 కోట్ల ఉపాధి అవకాశాలు పెరగటం, ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ వంటి సంక్షేమ పథకాలు, మహిళా ఉపాధి పెరగటం వలనే దేశంలో ఈ స్థాయిలో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది.

అయితే పేదరికాన్ని లెక్కించటానికి మనం తీసుకునే ఆధారాన్ని బట్టి కూడా గణాంకాలు మారిపోతుంటాయి. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే భారతదేశం దిగువ మధ్య ఆదాయ దేశంగానూ, మాన వాభివృద్ధి (హెచ్‌డీఐ)ని ప్రామాణికంగా తీసుకుంటే మధ్యస్థాయి మానవా భివృద్ధి దేశంగానూ కనపడుతుంది. కొంతకాలంగా పేదరికాన్ని లెక్కించ టానికి ఆదాయాన్ని కాకుండా వ్యయాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు.

ఆదాయాన్ని ఆధారంగా తీసుకుంటే పేదరికం ఎక్కువగానూ, ఖర్చును ఆధారంగా తీసుకుంటే తక్కువగానూ కనపడుతుంది. రోజుకు 3 డాలర్ల కంటే తక్కువ వ్యయం చేసేవారు తీవ్ర పేదరికంలో ఉన్నట్లుగా వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా వేస్తుంది. ఈ ప్రమాణం ప్రకారం దేశంలో కేవలం 2.6 శాతమే తీవ్ర పేదరికం ఉన్నదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ ఎంపీఐ (బహుముఖీయ సూచి) ఆధారంగా 2022–23 నాటికి దేశంలో 11.28 శాతం పేదరికం ఉన్నట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

40 శాతం సంపద కేవలం ఒక్క శాతం కుబేరుల చేతిలో కేంద్రీకృతమై ఉన్నదని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించటం దేశంలో అసమానతల తీవ్రతను తెలియజేస్తుంది. ఒకవైపు పేదరికం తగ్గటం, మరొకవైపు తీవ్రమైన ఆకలి కేటగిరీలో ప్రపంచ ఆకలి సూచీలో 100వ స్థానంలో ఉండటం, పౌష్టికాహార లోపంతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా ఉండటం ఆందోళన కలిగించే అంశాలు.
– డా. తిరునహరి శేషు, అర్థశాస్త్ర బోధకులు, కేయూ

ఇదీ చదవండి: వేడిని తగ్గించలేకపోతే వాడుకోగలగాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement