జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలోని ముఖ్య భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలని పాకిస్థాన్ ఖండించింది. ఈ వ్యవహారంలో స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఆయనని విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి, ఈ అంశంపై తీవ్ర నిరసన తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అమెరికా రాయబారి పర్యటించడం ఇదే తొలిసారి.
భారత్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమైన భాగం. అద్భుతమైన ప్రకృతి అందాలతో ఎంతో అందంగా ఉంది. ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని కళ్లారా చూడటం సంతోషంగా ఉంది అని గోర్ అన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో అమెరికా జారీ చేసిన 'లెవల్-4' ట్రావెల్ అడ్వైజరీని పునః పరిశీలిస్తామని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌పై సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని అమెరికా రాయబారి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. ఈ ప్రాంతం విషయంలో అమెరికా చాలా ఏళ్లుగా పాటిస్తున్న వైఖరికి విరుద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్ ఓ వివాదాస్పద భూభాగం. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రకటనలు తదనుగుణంగా ఉండాలని దౌత్యవేత్తను కోరాం అని పాక్ తెలిపింది.


