దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ (UFS) సంయుక్త సైనిక విన్యాసాలను వారం రోజుల ముందుగానే ముగించాలని యుఎస్ నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని పెంటగాన్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. కాగా ట్రంప్ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఈ విన్యాసాలు “అనుచితమైనవి, శత్రుత్వపూరితమైనవి” అంటూ వాటిని తగ్గించాలని అమెరికా రక్షణ శాఖను ఆదేశించారు.
ఉత్తర కొరియా ఒకవేళ తమ దేశాలపై దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా భాగంగా అమెరికా, దక్షిణ కొరియా ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయి. అయితే ఉత్తర కొరియా వీటిని చాలాకాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై దాడికి దక్షిణ కొరియా, అమెరికాలు చేస్తున్న సన్నాహక చర్యలుగా ప్యాంగ్యాంగ్ వీటిని అభివర్ణిస్తోంది. తనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించే సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఉల్చి ఫ్రీడం షీల్డ్ విన్యాసాల వ్యవధిని దక్షిణ కొరియా సైన్యం కుదించింది. మొదట ఈ విన్యాసాలను ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు వీటిని ఆగస్టు 17 నుంచి 21 వరకు జరపాలని నిర్ణయించారు. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.
ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా బుధవారం ఈ సైనిక విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని ఆదేశించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాకు “అత్యంత తక్షణమైన, బహిరంగ ముప్పు”గా పేర్కొంది. ఇవి ఉత్తర కొరియాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.
ఉత్తర కొరియా చాలాకాలంగా అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి తమ దేశంపై దాడి చేయడానికి నిర్వహించే “దాడి రిహార్సల్స్” అని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ సైనిక విన్యాసాలకు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశం లేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశాన్ని లేదా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబించవని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం తెలిపింది.
1950–53 మధ్య జరిగిన కొరియా యుద్ధం అనంతరం అమెరికా దక్షిణ కొరియాకు భద్రతా పరంగా మద్దతు ఇస్తోంది. ఆ యుద్ధం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంతో కాకుండా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో సుమారు 28,500 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వీరు దక్షిణ కొరియాకు మద్దతుగా ఉన్నారు. అయితే అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలతో ఉన్న భద్రతా ఒప్పందాలను ట్రంప్ పదేపదే ప్రశ్నించడం తూర్పు ఆసియాలో అమెరికా భద్రతా హామీలపై అనుమానాలకు కారణమవుతోంది.


