రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ అనుమానాస్పద అంటువ్యాధి కేసు కలకలం రేపుతోంది. ఇర్కుట్స్క్ సమీపంలోని యాంటీ–ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ డారియా షిపిలోవా తీవ్ర న్యుమోనియాతో మృతి చెందారు. అయితే ఆమెకు ప్లేగ్ సోకి ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెతో ఈ మధ్యకాలంలో కాంటాక్ట్ అయిన దాదాపు 200 మందిని పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్‌లో ఉంచారు.
రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. డారియా యాంటీ–ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో నమూనాలను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లైవ్ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ట్యూబ్ పగిలినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన తర్వాతే ఆమె అనారోగ్యానికి గురైనట్లు చెబుతున్నారు. మరణానికి కొద్దిసేపటి ముందు ఆసుపత్రి సిబ్బందికి కూడా డారియా ఈ విషయాన్ని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.
డారియా సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో షెలెఖోవ్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. రెండు రోజులకే మృతి చెందినట్లు స్థానిక స్వతంత్ర మీడియా సంస్థలు తెలిపాయి. ఆమె మరణానికి ప్లేగ్ కారణమై ఉండొచ్చన్న అనుమానాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే రష్యా ప్రజారోగ్య సంస్థ రోస్పోట్రెబ్‌నాడ్జోర్ మాత్రం ఆ పరిశోధనా కేంద్రంలో అలాంటి ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన్నట్లు సమాచారం.

డారియాతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి అధికారులు వైద్య పర్యవేక్షణలోకి తీసుకున్నారు. రష్యా మీడియా కథనాల ప్రకారం.. కనీసం 197 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో 100 మందికిపైగా ఆసుపత్రుల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇర్కుట్స్క్‌లో కనీసం నాలుగు ఆసుపత్రుల్లో క్వారంటైన్ విధించినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. రోగులను సందర్శించడంపైనా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన కొన్ని బహిరంగ కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు రష్యన్ మీడియా తెలిపింది. ఆరోగ్య భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
అదే అయితే.. ఎంత ప్రమాదం?
ప్లేగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను యెర్సినియా పెస్టిస్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి మూడు ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. అవి బుబోనిక్, సెప్టిసిమిక్, న్యుమోనిక్ ప్లేగ్. వీటిలో న్యుమోనిక్ ప్లేగ్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర ప్లేగ్ రూపాలతో పోలిస్తే ఇది వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. సోకిన వ్యక్తి నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధ్యయుగ కాలంలో యూరప్‌లో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న ‘బ్లాక్ డెత్’కు కూడా యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియానే కారణమైంది.
మంగోలియా సరిహద్దులోనూ అప్రమత్తత
ఇర్కుట్స్క్ ప్రాంతం మంగోలియాకు సమీపంలో ఉండటంతో అక్కడి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. డారియా బురియాటియా ప్రాంతానికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైనట్లు కొన్ని రష్యన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే బురియాటియా ప్రాంత అధిపతి అలెక్సీ సిడెనోవ్ ఈ వాదనను ఖండించారు. ఆమె బురియాటియాను సందర్శించినట్లు ఆధారాలు లేవని, ఆ ప్రాంతంలో ప్లేగ్ వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్‌కు మూలం బురియాటియాకు సంబంధం లేని పరిస్థితుల్లో ఉండొచ్చని పేర్కొన్నారు.
రష్యా అధికారుల ప్రత్యేక చర్యలు
పరిస్థితిని పర్యవేక్షించేందుకు రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పోపోవా ఇర్కుట్స్క్ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. రోస్పోట్రెబ్‌నాడ్జోర్ అవసరమైన అంటువ్యాధి నియంత్రణ చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. డారియాతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించడం, వారిని పర్యవేక్షించడం, అనుమానాస్పద కేసులను పరీక్షించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే రష్యా ప్రభుత్వం ప్లేగ్ వ్యాప్తిని అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికారులు పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతుండగా.. మరోవైపు ఆసుపత్రుల్లో క్వారంటైన్, వందల మందిపై నిఘా, ప్రజా కార్యక్రమాల రద్దు వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి.
అమెరికా కూడా ఆరా
రష్యాలో వెలుగుచూసిన ఈ పరిణామాలపై అంతర్జాతీయంగానూ దృష్టి పడింది. ఈ వ్యవహారంపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని, సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నామని అమెరికా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిస్థితిని గమనిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్లేగ్ జంతువుల్లో కనిపించే వ్యాధిగా అనేక ప్రాంతాల్లో ఉంది. 2019 నుంచి 2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 అనుమానిత ప్లేగ్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో గతంలో ప్లేగ్ వ్యాప్తులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడగాస్కర్‌లో మనుషులకు సోకిన సందర్భాలు ఎక్కువగా నమోదయ్యాయి.
ప్రస్తుతం రష్యాలో వెలుగుచూసిన ఘటన నిజంగా న్యుమోనిక్ ప్లేగ్ కేసేనా? ల్యాబ్‌లోనే ఇన్ఫెక్షన్ సోకిందా? మరణించిన డారియాకు వైరస్ లేదంటే మరేదైనా బ్యాక్టీరియా కారణమా? ఆమెతో సంబంధం ఉన్నవారికి ఇన్ఫెక్షన్ సోకిందా? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. యాంటీ–ప్లేగ్ ల్యాబ్ ఉద్యోగి అనుమానాస్పద మరణం, దాదాపు 200 మందిని పర్యవేక్షణలో ఉంచడం, ఆసుపత్రుల్లో క్వారంటైన్ చర్యలు మాత్రం తీవ్ర అప్రమత్తతకు కారణమవుతున్నాయి. అయితే నేటి రోజుల్లో ప్లేగ్‌కు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండటంతో సకాలంలో చికిత్స అందిస్తే వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చంద్రుడిపై హక్కులు ఏ దేశానివో తెలుసా?


