ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ షాక్‌! | Imran Khan Faces Fresh Setback as Pak Govt Moves to Review Hospital Transfer Order | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ షాక్‌!

Aug 19 2026 7:13 AM | Updated on Aug 19 2026 7:17 AM

Imran Khan Faces Fresh Setback as Pak Govt Moves to Review Hospital Transfer Order

జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. పాకిస్థాన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో హైడ్రామాకు దిగింది. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అంశంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.

మంగళవారం మూడు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్‌ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. సెప్టెంబర్‌ 16న కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచేందుకు ధర్మాసనం అనుమతించింది.

తొలుత ‘అమలు చేస్తాం’ అన్న ప్రభుత్వం
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పాకిస్థాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్‌ ఫజల్‌ చౌదరీ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ‘అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆయన పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకపోయినా.. జైలులోనే సాధ్యమైనంత ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే.. 

సుప్రీం ఆదేశాలపై ప్రభుత్వ సమీక్ష
కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు చేయడం కాకుండా.. వాటిలో తగిన మార్పులు చేయాలని కోరుతూ సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆజమ్‌ నజీర్‌ తరార్‌ ప్రకటించారు. సంబంధిత చట్టాన్ని పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టును సమీక్ష పిటిషన్‌ ద్వారా ఆశ్రయించి ఉత్తర్వుల్లో తగిన మార్పులు కోరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలుపై ఉత్కంఠ నెలకొంది.

‘జైల్లో నరకం చూపిస్తున్నారు’.. 
ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పరిస్థితులపై ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఆయనను ఒంటరిగా ఒక సెల్‌లో బంధించారని, ఎవరితో మాట్లాడనీయడం వలేదని, తాగేందుకు మురికి నీరు ఇస్తున్నారని అన్నారు. అంతేకాకుండా హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీల మధ్య ఆయనను ఉంచారని పేర్కొన్నారు. ఆయనను ‘డెత్‌ సెల్‌’లో ఉంచినట్లుగా ఉందని పీటీఐ అంటోంది. జైల్లో ఇమ్రాన్‌తో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు ఉన్నాయని, చివరకు జైలు గార్డులు సైతం ఆయనను పలకరించేందుకు అనుమతి లేదని ఆరోపిస్తోంది. మరోవైపు.. 

పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో ‘సైకాలజికల్‌ టార్చర్‌ స్ట్రాటజీ’ని అనుసరిస్తోందని ములాఖత్‌ అయిన సోదరి ఆరోపించారు. పరిస్థితి రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోందని.. తమ సోదరుడిపై ఆశను నిలుపుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్‌లో ఉన్న కొడుకులైతే.. ఆయన్ని మళ్లీ చూస్తామో లేదో అనే ఆందోళన సైతం వ్యక్తం చేశారు. అయితే షెహబాజ్‌ ప్రభుత్వం మాత్రం అవన్నీ ఆరోపణలనేనని.. జైలులో ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతోంది.

సోదరి పిటిషన్‌తో విచారణ
ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయనకు కంటి చూపు మందగించడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన సోదరి డాక్టర్‌ ఉజ్మా ఖాన్‌, పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అందించాలని వారు పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఆయనకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని, కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.

మూడేళ్లుగా జైలులోనే..
73 ఏళ్ల ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. పలు కేసుల్లో ఆయనకు శిక్షలు పడటంతో అడియాలా జైలులో నిర్బంధంలో కొనసాగుతున్నారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) ఆరోపిస్తున్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ 2018లో పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022 ఏప్రిల్‌లో పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తన పదవీకాలం పూర్తికాకముందే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనపై అవినీతి సహా పలు అంశాలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో ఆయనకు విధించిన శిక్షలు నిలిపివేయబడ్డాయి లేదా రద్దయ్యాయి. మరికొన్ని కేసుల్లో అప్పీళ్లు ఇంకా ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

నెలల తర్వాత సోదరితో ముఖాముఖి
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మరో సోదరి నోరీన్‌ నియాజీ ఆయనను జైలులో కలిశారు. చాలా నెలల తర్వాత ఇమ్రాన్‌తో ఆమె ముఖాముఖిగా మాట్లాడటం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులతో ఇమ్రాన్‌ ఖాన్‌ భేటీకి కూడా సుప్రీంకోర్టు అనుమతించడంతో ఈ సమావేశం జరిగింది.

చికిత్స విషయంలో మళ్లీ ఉత్కంఠ
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిపై సమీక్ష కోరాలని నిర్ణయించడం ఇమ్రాన్‌ ఖాన్‌ వైద్య చికిత్స అంశాన్ని మరోసారి రాజకీయ, న్యాయ వివాదంగా మార్చింది. ఒకవైపు మాజీ ప్రధాని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం జైలులోనే ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని చెబుతోంది.

ఇప్పుడు ప్రభుత్వం దాఖలు చేయనున్న సమీక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది. సెప్టెంబర్‌ 16న జరగనున్న తదుపరి విచారణకు ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రికి తరలిస్తారా? లేదంటే ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement