ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి విమానం కూల్చేందుకు యత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ మామూలోడు కాదని తెలుస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న అతనిపై యెమెన్ గతంలో బ్యాన్ కూడా విధించిందట. అలాంటప్పుడు ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా అతనెలా చేరాడు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
సదరు కో-పైలట్ గతంలో ఒమన్ ఎయిర్‌పోర్టులో ఏడేళ్లపాటు పనిచేసినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ట్రైనీ కో-పైలట్‌గా ఉన్నప్పుడు అతని వద్ద అనుమానాస్పద, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడం కలకలం రేపింది. దీంతో అతడిని పైలట్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. పరిపాలనా విభాగంలో కొనసాగించారు. ఇది 2024లోనే జరిగింది.
మరి అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఎలా చేరాడు? కో-పైలట్‌గా క్లియరెన్స్ ఎలా లభించింది?. అదీ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలోకి ఎలా వచ్చాడు? ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఒమన్‌లో ఉన్న అతడి భద్రతా రికార్డు ఇతర దేశాల అధికారులకు లేదంటే విమానయాన సంస్థలకు చేరిందా? ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం పొందే సమయంలో అతడిపై మళ్లీ భద్రతా తనిఖీలు జరిగాయా? అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు.
సెప్టెంబర్ 30న ఏం జరిగిందంటే..
ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ఉన్నారు. జోర్డాన్ గగనతలంలో ఉండగా కో-పైలట్ .. భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయింది. దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగులకు పైగా ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్ డేటా వెల్లడించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
టబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక సౌదీ అరేబియా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ కో-పైలట్‌ను యూఏఈ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం యూఏఈ దర్యాప్తు ప్రధానంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అధికారులు కూడా అతడిని ప్రశ్నించనున్నారు. ఉగ్రవాద సంబంధం, ముందస్తు ప్రణాళిక, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.
ఆ ప్రొఫైల్ అతనిదేనా?
ఇటు అతనికి సంబంధించిన వివరాలంటూ ఓ ప్రొఫైల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో ఆ కో-పైలట్ పేరు హమామ్ అల్-హమ్మామీ(అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది) అని ప్రచారం నడుస్తోంది. అతను యెమన్ వాసి అని, అలాగే ఓ ఫొటో కూడా వైరల్ అవుతోంది. అయితే ఘటన తర్వాత అతనిదిగా చెబుతున్న ఆ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ మాయమైందట. అంతేకాదు.. ఘటన జరిగిన రోజున ఆ ఖాతాలో రెండు పోస్టులు కనిపించాయి. ఒక పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ కాక్‌పిట్‌లో తీసిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ వీడియో చివర అల్‌ఖైదా మాజీ అధినేత అయ్‌మన్ అల్-జవాహిరి, 2009లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన హుమామ్ ఖలీల్ అబు-ములాల్ అల్-బలావీ చిత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ పోస్టులను హమ్మామీయే పెట్టాడా? లేక మరెవరైనా అప్‌లోడ్ చేశారా? అవి ముందుగానే షెడ్యూల్ చేశారా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో-పైలట్ చెప్పినట్లు కూడా రిపోర్టులు వెలువడ్డాయి.
నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. కో-పైలట్ ‘ఇస్లామిస్ట్ రాడికల్ ఇండోక్ట్రినేషన్’కు గురయ్యాడని, అంటే అతివాద భావజాలంతో ప్రభావితమయ్యాడని తెలిపారు. విమానాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతోనే అతడు వ్యవహరించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అతడిని ఎవరైనా పంపించారా? అన్నదానిపైనా దర్యాప్తు చేస్తున్నామని.. “అతడిని ఎవరైనా పంపి ఉంటే.. వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్ ప్రమేయానికి ఆధారాలు లభించలేదని భద్రతా వర్గాలు తెలిపాయి.
మరి ఇజ్రాయెల్ ఫ్లైట్‌లోకి ఎలా వచ్చాడు?
ఇక్కడే ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి దేశాల పైలట్లను ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో ఎలా అనుమతించారు?. పోనీ భద్రతా పరమైన నిబంధనలు ఉన్నాయా?అంటే.. ఇజ్రాయెల్-యూఏఈ ద్వైపాక్షిక విమాన ఒప్పందంలో అలాంటిదేం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఫ్లైదుబాయ్ ఎలా నియమించుకుందనేదే అసలు ప్రశ్న. ఇటు ఇజ్రాయెల్ భద్రతా పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఇజ్రాయెల్ అధికారులు పైలట్లను ముందుగానే స్క్రీన్ చేసే విధానాన్ని మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. ప్రధాని నెతన్యాహు కూడా పైలట్లను ముందుగానే స్క్రీన్ చేయడంలో ఉన్న “లొసుగు”పై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు.
మచ్చార్.. ది హీరో
ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన సందర్భంగా.. విమానం కిందికి వెళ్తోందని తెలుసుకుని ప్రయాణికులకు ఏం కాకూడదనే ఉద్దేశంతో గాయాలతో నేలపై ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నానని మచ్చారు వివరించారు. భారత కెప్టెన్ స్మిట్ మచ్చారు సమయస్ఫూర్తి,ధైర్యం వల్లే ఫ్లైదుబాయ్ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. గాయపడినా హనుమాన్ చాలీసా పటిస్తూ బలం తెచ్చుకుని.. కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు స్మిట్. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. విమానంలోని వాళ్ల ప్రాణాలు కాపాడారు. అందుకే ప్రపంచం మొత్తం ఆయన్ని హీరోగా ప్రశంసిస్తోంది.
2024లోనే భద్రతా ముప్పుగా గుర్తించి విమానాలు నడపకుండా నిషేధించిన వ్యక్తి.. ఆ తర్వాత మరో అంతర్జాతీయ విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడి గత రికార్డులు ఎందుకు అడ్డుకాలేదు? టెల్‌అవీవ్ వెళ్లే విమానానికి అతడు ఎలా క్లియర్ అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఇదేం ట్విస్ట్?? యూదులను చంపేయాలా!


