ఇస్లామాబాద్: ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యవిషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన జైలులోనే మృతిచెందారంటూ ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వ్యాఖ్యలు చేయడంతో పీటీఐ పెద్ద ఎత్తున నిరసనలు చేసింది. ఆయన ఆరోగ్యంపై స్పష్టతనివ్వాలంటూ ఆందోళనలు చేపట్టింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఆయన ఇమ్రాన్ ఖాన్ సుమారు తొమ్మిది నెలల తర్వాత తన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీని అదియాలా జైలులో కలిశారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ అంశంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్యం, వైద్య సదుపాయాలపై ఆందోళనల నేపథ్యంలో జైలు అధికారులు ఇకపై వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు, కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జైలులో ఆయనను వారి సోదరిణిలు కలిశారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది.
ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. . నూరీన్ ఇమ్రాన్‌ను సుమారు 15 నిమిషాల పాటు కలిశారు. సుప్రీంకోర్టు ఆయనను షిఫా ఆస్పత్రికి తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఆమె ఇమ్రాన్‌కు వివరించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపైనా చర్చించారు. అనంతరం బుష్రా బీబీతో ఇమ్రాన్ సుమారు 30-35 నిమిషాల పాటు సమావేశమయ్యారు." అని కథనాలు ప్రచురించాయి.
అధిక భద్రత కలిగిన రావల్పిండి జైలు నుంచి తనను ఆస్పత్రికి తరలించాలని, తనకు నచ్చిన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలకు ప్రాప్యత రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించిన అంశాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో ఇమ్రాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి, నిపుణులతో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించనుంది.
ఈ బోర్డులో ఆయన వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ కూడా ఉంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కంటి సమస్యకు చికిత్స కోసం ఇమ్రాన్‌ను పలుమార్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జనవరి చివర్లో ఆయన కుడి కంటికి సుమారు 85 శాతం చూపు కోల్పోయారని కుటుంబ సభ్యులు చెప్పగా, ప్రభుత్వం ఆ వాదనను ఖండించింది. అనంతరం ఆయనకు సుమారు 70 శాతం చూపు తిరిగి వచ్చిందని, పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు. ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన మద్దతుదారులు అక్కడికి భారీగా చేరి ఇతర రోగులకు ఇబ్బంది కలిగించవద్దని న్యాయవాది రాజా కోరారు.
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్వాగతించింది. ఆయన ఆరోగ్యం, వైద్య సేవలకు ప్రాప్యతపై చాలాకాలంగా ఉన్న ఆందోళనలకు ఈ తీర్పు పరిష్కారం చూపుతుందని పేర్కొంది. అయితే ఇమ్రాన్ వైద్య చికిత్సకు సంబంధించిన కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అజమ్ నజీర్ తరార్ తెలిపారు.


