ఒక నేరానికి విధించే అత్యంత కఠినమైన శిక్ష.. మరణశిక్ష. అయితే దాన్ని అమలు చేసే విధానం మాత్రం దేశానికో రకంగా ఉంటుంది. ఉదాహరణకు.. భారత్‌లో ఉరి. అలాగే కొన్నిదేశాల్లో లెథల్ ఇంజెక్షన్, కొన్ని చోట్ల తుపాకీతో కాల్చిచంపడం.. ఇంకొన్ని చోట్ల రాళ్లతో కొట్టి చంపడం, శిరచ్ఛేదం.. ఇలా ఎన్నో. అయితే భారత్‌లో ఉరి విధానంపై సుప్రీంకోర్టు తీర్పుతో.. నొప్పి లేకుండా చంపే మార్గాలపై, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న మరణశిక్ష పద్ధతులపై మరోసారి చర్చ మొదలైంది.
మన దేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమలు చేసే చట్టబద్ధమైన పద్ధతి ఉరి. అంటే మెడకు ఉరి బిగించి మరణం సంభవించే వరకు వేలాడదీయడం. ఉరి విధానం క్రూరమైనదని, దాని స్థానంలో తక్కువ బాధ కలిగించే పద్ధతిని తీసుకురావాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌ను తాజాగా(మంగళవారం) సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయ పద్ధతులపై భవిష్యత్తులో కొత్త శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పరిశీలనకు అవకాశం ఉంటుందని కోర్టు సంకేతం ఇచ్చింది.
ఉరి.. 40 నిమిషాలు
భారత్‌లో అమలయ్యే ఉరి విధానం ఎక్కువ సమయం తీసుకుంటుందని పిటిషనర్ వాదించారు. ఉరిలో ఖైదీ చనిపోయినట్లు నిర్ధారించడానికి 40 నిమిషాలకుపైగా పట్టొచ్చని, షూటింగ్‌లో కొన్ని నిమిషాలు, ఇంట్రావీనస్ లెథల్ ఇంజెక్షన్‌లో సుమారు 5 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పోలికను లా కమిషన్ 187వ నివేదికలోని వివరాలతోనూ సమర్థించారు.
లెథల్ ఇంజెక్షన్: అమెరికాలో అత్యంత సాధారణంగా ఉపయోగించే విధానం. 2025లో అమెరికాతో పాటు చైనా, వియత్నాంలోనూ ఈ పద్ధతి ద్వారా మరణశిక్షలు అమలైనట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
ఫైరింగ్ స్క్వాడ్: తుపాకులతో కాల్చి మరణశిక్ష అమలు చేసే పద్ధతి. 2025లో అఫ్గానిస్థాన్, చైనా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, సోమాలియా, తైవాన్, యూఏఈ, అమెరికా, యెమెన్ తదితర దేశాల్లో ఈ విధానం నమోదైంది.
ఎలక్ట్రిక్ చైర్: విద్యుత్ ప్రవాహం ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతి. ఇది ప్రధానంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ విధానంగా కొనసాగుతోంది.
గ్యాస్/నైట్రోజన్: గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. 2025లో అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ అస్ఫిక్సియేషన్ ద్వారా మరణశిక్ష అమలు నమోదైంది. ఓ చాంబర్‌లో దోషుల్ని ఉంచి ఈ శిక్ష అమలు చేస్తారు.
సౌదీలో.. శిరచ్ఛేదం
ప్రపంచంలో అత్యంత భిన్నమైన పద్ధతుల్లో ఒకటి శిరచ్ఛేదం. 2025లో సౌదీ అరేబియాలో ఈ విధానం ద్వారా మరణశిక్షలు అమలయ్యాయి. అమ్నెస్టీ గణాంకాల ప్రకారం.. అదే దేశంలో కాల్చివేత, లెథల్ ఇంజెక్షన్ వంటి పద్ధతులూ నమోదయ్యాయి.
ఉరి ఎక్కడెక్కడ?
భారత్‌లో మాత్రమే కాదు.. మరణశిక్ష అమలుల్లో ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, సింగపూర్, దక్షిణ సూడాన్ దేశాల్లో ఉరి విధానం ఉపయోగించినట్లు అమ్నెస్టీ పేర్కొంది. అలాగే.. కొన్ని దేశాల్లో చట్టాలతో సంబంధం లేకుండా నైతిక శిక్షల పేరిట రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం లాంటివి చేస్తున్నారు.
ప్రపంచంలో మరణశిక్ష తగ్గుతున్నా..
అయితే.. మరణశిక్షను రద్దు చేస్తున్న దేశాలు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో అమలులు మాత్రం కొనసాగుతున్నాయి. 2025లో అమ్నెస్టీ 17 దేశాల్లో కనీసం 2,707 మరణశిక్షల అమలును నమోదు చేసింది. ఈ సంఖ్య 2024తో పోలిస్తే 78 శాతం ఎక్కువ. చైనాలో అమలు చేసినట్లు భావిస్తున్న వేలాది మరణశిక్షలు ఈ లెక్కల్లో లేవు. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలు ఇప్పటికే మరణశిక్షను చట్టపరంగానో, ఆచరణలోనో రద్దు చేశాయి. అంటే.. ఒకవైపు భారత్‌లాంటి దేశాల్లో మరణశిక్ష అమలులు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు దానికి దూరమవుతున్నాయి.


