రష్యాతో కాల్పుల విరమణపై ఉక్రెయిన్ మంత్రి వెల్లడి
కీవ్: రష్యాతో కాల్పుల విరమణ విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు. కాల్పుల విరమణ అంశంలో తమకు భారత్, టర్కీ, ఈజిప్‌్ట, అమెరికా నుంచి మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. వాటిలో భారతదేశ ప్రతిపాదన అత్యంత విస్తృతమైనదిగా, ఉపయుక్తమైనదిగా అభివర్ణించారు.
ఇంధన మౌలిక సదుపాయాలు, నల్ల సముద్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే కాల్పుల విరమణను పరిశీలిస్తామని అన్నారు. ఏ ఒప్పందమైనా సరే కేవలం పోరాట కార్యకలాపాలనే కాకుండా, ఇంధన, ఓడరేవు మౌలిక సదుపాయాలపై దాడులను, అలాగే నల్ల సముద్రంలోని పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. సిబిహా శుక్రవారం కీవ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది.
ఇప్పటికే ఇరుదేశాల్లో వేలాది మంది పౌరుల బలైపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. యుద్ధాన్ని ముగించాలంటూ ఉక్రెయిన్, రష్యాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఉక్రెయిన్ ఘర్షణకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


