టర్కీ నుంచి రప్పించి ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్, డ్రగ్స్ రవాణా ముఠా నాయకుడు నవప్రీత్ సింగ్‌ను దర్యాప్తు సంస్థలు టర్కీ నుంచి భారత్‌కు రప్పించాయి. నవప్రీత్ తరలింపు ఆపరేషన్‌లో పాల్గొన్న దర్యాప్తు సంస్థలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. ఈ ఘటనను డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపడంలో మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయంగా అభివర్ణించారు. నవప్రీత్ నకిలీ గుర్తింపుతో టర్కీలో మకాం వేశాడు.
అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌లోకి హెరాయిన్, మెత్ వంటి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన భారత దర్యాప్తు సంస్థలు అతడి నెట్‌వర్క్‌ను ఛేదించాయి. టర్కీలో నకిలీ గుర్తింపును బట్టబయలు చేసి, స్థానిక అధికారుల సహకారంతో భారత్‌కు రప్పించాయి. ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ పోలీసు విభాగం స్పెషల్ సెల్ అతడిని అరెస్టు చేసింది.
శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించారు. దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ నెట్‌వర్క్‌పై నిర్వహించిన దర్యాప్తులో నవప్రీత్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున పట్టుబడిన హెరాయిన్ కేసు దర్యాప్తులో నవప్రీత్ సింగ్ హస్తం ఉన్నట్లు గుర్తించారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీసులు ఛేదించిన నార్కో–హవాలా రాకెట్‌లోనూ అతడి పాత్ర ఉన్నట్లు తేల్చారు. అమృత్‌సర్ ఆపరేషన్‌లో 1.10 కిలోల హెరాయిన్, రూ.కోటికి పైగా హవాలా నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసుల మూలాలను వెతుక్కుంటూ వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థలు చివరకు టర్కీలో ఉన్న ప్రధాన సూత్రధారి నవప్రీత్ సింగ్‌ను పట్టుకున్నాయి.
2029 నాటికి డ్రగ్స్ భూతం అంతం
దేశంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ భూతాన్ని సమూలంగా నాశనం చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ భద్రత, యువత భవిష్యత్తును కాపాడేందుకు దర్యాప్తు సంస్థలు అహరి్నశలూ శ్రమిస్తున్నాయని ‘ఎక్స్’లో పోస్టుచేశారు.


