ముందుచూపే ఇరాన్‌ను బతికించిందా?.. ఇక మీదట ఎలా? | Did Iran's Foresight Save Its Economy From the War | Sakshi
Sakshi News home page

ముందుచూపే ఇరాన్‌ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?

Aug 19 2026 2:05 PM | Updated on Aug 19 2026 2:41 PM

Did Iran's Foresight Save Its Economy From the War

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్‌ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇరాన్‌పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్‌కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్‌ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్‌ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్‌ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్‌ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

హర్ముజ్‌ మూసుకుపోతే..
ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్‌ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కూ ఆందోళన మొదలైంది.

అయితే హర్ముజ్‌ను తెరిచే విషయంలో ఇరాన్‌ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘెర్‌ గాలిబాఫ్‌ స్పష్టం చేశారు.

సముద్ర మార్గం దెబ్బతింటే..
హర్ముజ్‌ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్‌ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్‌, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్‌ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.

యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్‌కు కొంత ఊరటనిస్తున్నాయి.

చమురు ఆదాయం తగ్గితే..
అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్‌కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.

ఇప్పటికే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.

ఇంధన కొరత ముంచుకొస్తుందా?
చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్‌కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.

శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్‌, గ్యాస్‌ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ స్టడీస్‌కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.

ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్‌ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.

యుద్ధానికి ముందే బలహీనంగా..
ఇరాన్‌ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.

అంటే ఇరాన్‌ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.

పెజెష్కియాన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇక ముందు ఎలా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్‌ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్‌ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్‌ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్‌ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.

అదే సమయంలో హర్ముజ్‌ జలసంధి సంక్షోభం ఇరాన్‌ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement