పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్‌లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.
మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.
ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.
‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్
యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.
అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.
యూఏఈలో మిసైల్ అలర్ట్
ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నారు.
జూన్‌లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.
ఇరాన్‌తో సంబంధాలు కట్!
తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులు
యూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్‌లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’
మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్‌ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!
ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్‌పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.


