యూఏఈలో భారతీయులకు గుడ్‌న్యూస్.. ఈ రూల్స్‌ తెలుసా? | UAE Visit Visa Extension Rules 2026 Fees Stay Limits Indians | Sakshi
Sakshi News home page

యూఏఈలో భారతీయులకు గుడ్‌న్యూస్.. ఈ రూల్స్‌ తెలుసా?

Oct 4 2026 3:38 AM | Updated on Oct 4 2026 3:41 AM

UAE Visit Visa Extension Rules 2026 Fees Stay Limits Indians

యూఏఈని ముఖ్యంగా దుబాయ్, అబుదాబి ప్రాంతాలను చాలా మంది భారతీయులు సందర్శిస్తూ ఉంటారు. ఇలా వచ్చినవారు వీసా గడువు ముగిసేలోపు వచ్చిన పనిని ముగించుకోవాలని టెన్షన్‌ పడుతూఉంటారు. అయితే యూఏఈలో ఎక్కువ రోజులు ఉండాలనుకునే భారతీయ సందర్శకులు  వీసా గడువు ముగిసేలోపే కొన్ని రకాల టూరిస్ట్, విజిట్, ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాల అన్వేషణ వీసాలను దేశం విడిచి వెళ్లకుండానే పొడిగించుకునే అవకాశం ఉంది.

అయితే అన్ని వీసాలకు ఒకే నిబంధనలు వర్తించవు. వీసా ఎందుకోసం కోసం జారీ అయింది, ఏ ఎమిరేట్‌ లేదా అధికారం దాన్ని జారీ చేసింది అనే అంశాల ఆధారంగా గరిష్ఠ వ్యవధి, ఫీజులు మారుతాయి. యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP), దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలు ఉన్నాయి.

టూరిస్ట్ వీసాకు 120 రోజుల వరకు..

సాధారణ టూరిస్ట్ ఎంట్రీ పర్మిట్‌ను జారీ చేసిన అథారిటీ నిర్ణయంతో ఒకసారి లేదా ఎక్కువసార్లు పొడిగించుకోవచ్చు. అయితే మొత్తం పొడిగింపు వ్యవధి 120 రోజులకు మించకూడదు. దుబాయ్ జారీ చేసే సింగిల్ లేదా మల్టిపుల్ ట్రిప్ టూరిస్ట్ వీసాలకు GDRFA కూడా ఇదే 120 రోజుల గరిష్ఠ పరిమితిని పేర్కొంది.

దుబాయ్‌లో ఈ వీసా పొడిగింపు సేవను డిజిటల్ ఛానళ్లతో పాటు AMER సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. ఈ తరహా టూరిస్ట్ వీసాలను దుబాయ్‌లో గుర్తింపు పొందిన పర్యాటక కార్యాలయాలే జారీ చేయాలి.

ఫీజు ఎంతంటే..

GDRFA వివరాల ప్రకారం.. దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు ఫీజు 600 దిర్హామ్. దీనికి 5 శాతం వ్యాట్ అదనంగా ఉంటుంది. సందర్శకుడు ఇప్పటికే యూఏఈలో ఉన్నట్లయితే 10 దిర్హామ్ నాలెడ్జ్ దిర్హామ్, 10 దిర్హామ్ ఇన్నోవేషన్ దిర్హామ్, 500 దిర్హామ్ ఇన్‌సైడ్-కంట్రీ ఫీజు వంటి అదనపు చార్జీలు వర్తించవచ్చు. ఈ మేరకు చెల్లించాల్సిన తుది మొత్తం వ్యక్తిగత పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులు, స్నేహితులను కలవడానికి వెళ్తే..

బంధువులు లేదా స్నేహితులను కలిసేందుకు తీసుకున్న విజిట్ ఎంట్రీ పర్మిట్‌కు టూరిస్ట్ వీసా కంటే భిన్నమైన నిబంధనలు ఉన్నాయి. ICP ప్రకారం ఇటువంటి అనుమతిని జారీ చేసే అథారిటీ నిర్ణయంతో ఒకసారి లేదా పలుమార్లు వీసాను పొడిగించుకోవచ్చు. అయితే మొత్తం వ్యవధి 180 రోజులకు మించకూడదు. దుబాయ్ GDRFA కూడా బంధువులు లేదా స్నేహితుల విజిట్ వీసా పొడిగింపునకు 180 రోజుల గరిష్ఠ పరిమితిని పేర్కొంది. దుబాయ్‌లో ఈ కేటగిరీకి కూడా సాధారణంగా 600 దిర్హామ్ పొడిగింపు ఫీజు, 5 శాతం వ్యాట్‌తో పాటు, దేశంలోనే ఉండి పొడిగించుకునే సందర్భంలో అదనపు చార్జీలు వర్తించవచ్చు.

ఉద్యోగం కోసం వచ్చిన వారికి..

యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించేందుకు ప్రత్యేకంగా తీసుకున్న విజిట్ ఎంట్రీ పర్మిట్ ఉన్నవారికి కూడా 180 రోజుల వరకు పొడిగింపు అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలను అన్వేషించే వీసాను జారీ చేసే అధికారం నిర్ణయంతో ఒకసారి లేదా పలుమార్లు పొడిగించవచ్చని ICP చెబుతోంది. వ్యాపారం ప్రారంభించే అవకాశాలను అన్వేషించే ఎంట్రీ పర్మిట్‌కూ ఇదే 180 రోజుల గరిష్ఠ పరిమితి ఉంది.

దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాల కోసం ఇచ్చే విజిట్ వీసా పొడిగింపునకు GDRFA 600 దిర్హామ్ + 5 శాతం వ్యాట్ ఫీజును పేర్కొంది. వ్యక్తి ఇప్పటికే దేశంలో ఉంటే 500 దిర్హామ్ ఇన్‌సైడ్-కంట్రీ ఫీజుతో పాటు ఇతర చిన్నపాటి చార్జీలు కూడా చెల్లించాల్సి రావచ్చు.

వీసా గడువు దాటితే జరిమానా

వీసా గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ఆటోమేటిక్ గ్రేస్ పీరియడ్ ఉంటుందని భావించకూడదు. ICP మార్గదర్శకాల ప్రకారం వర్తించే గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత యూఏఈలో కొనసాగితే రోజుకు 50 దిర్హామ్ ఓవర్‌స్టే జరిమానా విధిస్తారు. అందువల్ల భారతీయ ప్రయాణికులు తమ వీసా కేటగిరీ, అనుమతించిన చివరి తేదీని ముందుగానే తనిఖీ చేసుకోవాలి. గడువు ముగిసేలోపే సంబంధిత జారీ సంస్థ ద్వారా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడం సురక్షితం.

దుబాయ్, ఇతర ఎమిరేట్లకు వేరువేరు నిబంధనలు

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దుబాయ్ వీసాలకు GDRFA, ఇతర ఫెడరల్ పరిధిలోని ఎమిరేట్లకు ICP నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల ఒక ఎమిరేట్‌లోని వీసా నిబంధనలను మరో ఎమిరేట్ వీసాకు యథాతథంగా వర్తింపజేయకూడదు. అలాగే కొన్ని ప్రత్యేక కేటగిరీల ప్రవేశ అనుమతులకు పొడిగింపు అవకాశం ఉండకపోవచ్చు.

అంటే యూఏఈలో మరో నెల లేదా రెండు నెలలు ఉండొచ్చని ముందుగానే నిర్ణయించుకునే బదులు.. తమ వద్ద ఉన్నది టూరిస్ట్ వీసానా, ఫ్యామిలీ విజిట్ వీసానా, ఉద్యోగ అన్వేషణ వీసానా, వ్యాపార అవకాశాల వీసానా అనేది మొదట తెలుసుకోవాలి. ఆ కేటగిరీకి వర్తించే గరిష్ఠ వ్యవధి, ఫీజులు, పొడిగింపు విధానాన్ని సంబంధిత అధికారిక పోర్టల్‌లో నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement