దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపుతప్పిన ఒక భారీ ట్రక్కు రద్దీగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో పాటు మంటలు చెలరేగిన ఈ దుర్ఘటనలో పలువురు భారతీయ పౌరులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఫుజైరా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ భయానక ప్రమాదం సంభవించింది. భారీ ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది ముందుగా ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తా పడి, రద్దీ కారణంగా నెమ్మదిగా కదులుతున్న లేదా ఆగిపోయిన దాదాపు 23 వాహనాలపైకి (ఇందులో 18 కార్లు, 5 ట్రక్కులు ఉన్నాయి) దూసుకెళ్లింది.
ఈ తీవ్రమైన ఢీకొనడం వల్ల ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో చుట్టూ ఉన్న ఇతర వాహనాలకు సైతం వేగంగా వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో వాహనాలు దగ్ధమవడంతో ప్రాణనష్టం భారీగా సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
భారతీయుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో కొందరు భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. ముఖ్యంగా కేరళకు చెందిన కొందరు వ్యక్తులు (ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సహా) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలార్పి, గాయపడిన 30 మందిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో సగం మంది చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా, మిగిలిన వారికి వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు.
అయితే, ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా దగ్ధమవడంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. దీంతో మృతుల గుర్తింపు కోసం అధికారులు డీఎన్ఏ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరారు.


