నిశ్శబ్దంగా ఉండండని పిలుపు
గౌరవంగా నడుచుకోవాలని హెచ్చరిక
వాషింగ్టన్: దేశ రక్షణ మంత్రికి ఒక సామాన్య సైనికుడు వార్నింగ్ ఇచ్చిన ఘటన మనమెప్పుడైనా చూశామా? అస్సలు చూసుండము. కానీ.. అమెరికాలో ఈ అసాధారణ సంఘటన జరిగింది. రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్‌సెథ్, భార్య జెన్నిఫర్, మిలటరీ ఉన్నతాధికారి రికీ బూరియా, డిప్యూటీ ప్యాట్రిక్ వీవర్, సీనియర్ సలహాదారు టామా రాడాబాగ్‌లు వెటరన్స్ డే సందర్భంగా ఆర్లింగ్టన్‌లోని ‘టూంబ్ ఆఫ్ ద అన్‌నోన్ సోల్చర్’ను సందర్శించారు.
ఇదో స్మారకస్థలి. సైనికుల త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్నది. రాజకీయ నేతలు ఏడాదిలో ఒకట్రెండు సార్లు సందర్శించడం, నివాళులు అరి్పంచడం కద్దు. హెగ్‌సెథ్, ఆతడి వెంట వచ్చిన ఉన్నతాధికారుల ఉద్దేశమూ అదే. అయితే... వీరు ఆ స్మారకస్థలి మెట్లపై నిలబడి ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారట. గుంపుగా.. సింగిల్‌గా, ఇతరులతో కలిసి.. ఇలా రకరకాలుగా ఫొటోలు తీసుకుంటూండగా మాటలు పెరిగాయి.
కొందరు జోకేశారో ఏమో.. బిగ్గరగా నవ్వడమూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. కానీ.. అక్కడ గార్డు డ్యూటీ చేస్తున్న సైనికుడికి ఇవన్నీ ఏమాత్రం సహించలేదు. కాసేపు ఓపిక పట్టాడు కానీ.. వీరి నవ్వులతో అది నశించి పోయింది. తుపాకీతోనే... కొన్ని అడుగులు ముందుకేసి హెగ్‌సెథ్ బృందం ఉన్న వైపునకు తిరిగాడు. ‘‘విజిటర్లు అందరూ నిశ్శబ్ధ వాతావరణాన్ని మెయిన్‌టెయిన్ చేయాలి. గౌరవంగా నడుచుకోవాలి’’అని బిగ్గరగా అరిచాడు. దీంతో బిత్తరపోవడం రక్షణ మంత్రి, సిబ్బంది వంతైంది.
ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ సంస్థ పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ మాట్లాడుతూ ‘‘ఇదో స్మృతి దినం. ఆ సైనికుడు కరెక్టుగానే చెప్పాడు. గౌరవపూర్వకంగానే ఆ స్థలంలో సక్రమంగా నడుచుకోవాలని గుర్తు చేశాడు’’అని స్పష్టం చేశాడు. ‘‘అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు ప్రాణత్యాగం చేసిన సైనికులను రక్షణ మంత్రి అతడి మంత్రిత్వ శాఖ తప్పకుండా గౌరవిస్తుందని, ఇకపై కూడా ఆ గౌరవాన్ని కొనసాగిస్తుంది’’అని వివరించారు.
‘టూంబ్ ఆఫ్ ద అన్‌నోన్ సోల్జర్’అమెరికాలోని సైనిక స్మారకాల్లో అతి ముఖ్యమైంది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతోపాటు కొరియాతో జరిగిన యుద్ధంలో మరణించిన వీరుల స్మారకార్థం ఏర్పాటు చేశారు. అమెరికా ఆర్మీలోని థర్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ సైనికులు 1948 నుంచి ఈ స్మారకస్థలానికి గౌరవ సూచకంగా కావలి కాస్తూంటారు. ఎండ, వాన.. మరే ఇతర ఇబ్బందులొచ్చినా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కావలి మాత్రం వీడరు. ఈ రెజిమెంట్‌ను ‘‘ద ఓల్డ్ గార్డ్’అని కూడా పిలుస్తారు.


