ఫ్లైదుబాయ్ హీరో స్మిట్‌ మచ్చార్‌ను కలిసిన దుబాయ్ యువరాజు | Dubai Prince meets FlyDubai hero Captain Smit Machchhar | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్ హీరో స్మిట్‌ మచ్చార్‌ను కలిసిన దుబాయ్ యువరాజు

Oct 3 2026 8:23 PM | Updated on Oct 3 2026 8:40 PM

Dubai Prince meets FlyDubai hero Captain Smit Machchhar

విమానం గాలిలో ప్రయాణిస్తుండగా తన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, నగరంలోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్న భారతీయ పైలట్, స్మిట్‌ మచ్చార్‌ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరామర్శించారు. తను తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి, తద్వారా 172 మంది ప్రయాణికులతో పాటు విమానంలో ఉన్న సిబ్బంది ప్రాణాలను కాపాడినందుకు ఆ పైలట్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో దుబాయ్ యువరాజు ఆ పైలట్‌పై తన ప్రశంసలు, అభినందనలు తెలిపారు.

"మా తరపున, దేశ నాయకత్వం తరపున, ఆయనకు మా సంపూర్ణ ప్రశంసలు, అభినందనలు. ఆయన మా బృందంలో భాగమైనందుకు... మా దేశ చరిత్రలో భాగమైనందుకు... కరుణామయ దేశంగా... శాంతి దేశంగా... జీవన దేశంగా నిలిచే యూఏఈలో భాగమైనందుకు మేము గర్విస్తున్నామని ఆయన Xలో రాశారు.

దుబాయ్ యువరాజు పైలట్‌ మచ్చార్‌తో కలిసి అతన్ని ఆలింగనం చేసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి మచ్చార్ కెప్టెన్‌గా ఉన్నారు. ఒమన్ జాతీయుడైన హమామ్ అల్హమ్మమీ అతని కో-పైలట్‌గా ఉన్నారు. విమానాన్ని కూల్చివేయాలనే ప్రయత్నంలో భాగంగా అతను అకస్మాత్తుగా కాక్‌పిట్ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేశాడు.

ఇద్దరు పైలట్ల మద్య జరిగిన ఘర్షణ సమయంలో విమానం నిమిషాల వ్యవధిలోనే వేల అడుగులు కిందకు పడిపోయింది. కూలిపోయే దిశగా దూసుకుపోతోంది. చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. తన అసాధారణమైన సమయస్ఫూర్తితో ధైర్యంగా మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దాంతో వారు లోపలికి పరుగెత్తుకొచ్చి, దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని నిలకడగా ఉంచారు. వెంటనే విధుల్లో లేని పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పైలట్ వీరోచితాన్ని ఇప్పటికే ప్రశంసించారు. విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించాడన్న ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే, అతని తీవ్రవాద భావజాలంపై ఉన్న ఆందోళనల కారణంగా అల్-హమ్మామీని గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధించారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

ప్రస్తుతం ఈ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్న యూఏఈ, ఈ ఘటనకు ఏదైనా "ఉగ్రవాద కార్యకలాపాలు లేదా ఉద్దేశ్యంతో" సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. హమామ్ అల్-హమ్మామీ ఒమన్ పౌరుడు. అతను యూఏఈలో ఒమన్ తండ్రికి, సిరియా తల్లికి జన్మించాడు. తన జీవితంలోని చాలా సంవత్సరాలు యూఏఈలోనే గడిపాడని ఆ నివేదిక పేర్కొంది.

స్మిట్‌ మచ్చార్ తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం కోలుకుంటున్నారు
కెప్టెన్ స్మిట్‌ ప్రస్తుతం వైద్య సంరక్షణలో ఉన్నారు. బాగా కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. వారి సంరక్షణను చూస్తున్న యూఏఈ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం కోసం శ్రేయోభిలాషులతో కలిసి మేము ప్రార్థిస్తున్నామని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. స్మిట్‌ మచ్చార్ గాయాలు పూర్తిగా నయం కావడానికి కొంత సమయం పడుతుందని అతని తండ్రి భూపేంద్ర మచ్చార్ మీడియాకి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement