ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన ట్రంప్.. టెహ్రాన్ ముందు రెండు మార్గాలే ఉన్నాయని హెచ్చరించారు. అవి.. ‘ఈజీ వే.. లేదా హార్డ్ వే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్న ఆయన.. అమెరికా తదుపరి చర్య ఏంటనేది త్వరలోనే తేలుస్తానన్నారు. అయితే, తాను తీసుకోబోయే నిర్ణయం సైనిక చర్యా, దౌత్యపరమైన చర్యా అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
వైట్‌హౌస్ నుంచి ఒహియోకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై తమ తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ ఇప్పటికే ధ్వంసమైంది. ఇప్పుడు అది సులభమైన మార్గమా.. కఠినమైన మార్గమా అన్నదే ప్రశ్న అన్న ఆయన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం సాధించే ప్రయత్నాలను దాదాపు విరమించుకుంటోందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, అమెరికా మిత్రదేశాలకు చెందిన లక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త ఘర్షణను నివారించేందుకు ఇరాన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
క్యాంప్ డేవిడ్‌లో కీలక భేటీ
ట్రంప్ తాజా వ్యాఖ్యలకు ముందు అమెరికా అత్యున్నత జాతీయ భద్రతా అధికారులు క్యాంప్ డేవిడ్‌లో రహస్య సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దౌత్య చర్చలు, అవసరమైతే తిరిగి భారీ సైనిక చర్య చేపట్టే అవకాశాలపై ఈ భేటీలో చర్చించినట్లు Axios తెలిపింది. యెమెన్‌లో సౌదీ అరేబియా-హౌతీ ఘర్షణలపై అమెరికా విధానంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. దౌత్యపరమైన చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్న సమయంలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే ఇరాన్‌పై అమెరికా మళ్లీ పెద్దఎత్తున సైనిక చర్యకు దిగే అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇరాన్ కూడా సిద్ధం..
మరోవైపు అమెరికా మళ్లీ భారీ స్థాయిలో దాడులు ప్రారంభిస్తే గతంలో కంటే మరింత విస్తృతంగా, తీవ్రంగా ప్రతిదాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్ సైనిక కమాండర్లు అమెరికాకు సంబంధించిన లక్ష్యాలతో పాటు.. అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇచ్చే దేశాలు, మధ్యప్రాచ్యం వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యాలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇరాన్ కూడా దౌత్య మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదు. కొత్త ఘర్షణను నివారించేందుకు చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ.. ఇరాన్‌లోని కొందరు అధికారులు అమెరికాతో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఇరాన్ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అమెరికా తన ఇరాన్ పోర్టులపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవడానికి సిద్ధమని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. అయితే అమెరికా అధికారిక స్పందనపై ఇరాన్ తొలుత భిన్నంగా స్పందించినప్పటికీ, ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికా సమాధానం అందినట్లు తర్వాత వెల్లడించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ.. తుది ఒప్పందంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
యెమెన్ అంశం కూడా కీలకమే..
ఇరాన్‌తో ఉద్రిక్తతలకు తోడు యెమెన్‌లో హౌతీలపై సౌదీ అరేబియా సైనిక చర్యకు సిద్ధమవుతోంది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్ మండేబ్ జలమార్గంపై హౌతీల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా సౌదీ మద్దతు ఉన్న యెమెన్ బలగాలు ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చర్యకు అమెరికా నిఘా సహకారం అందిస్తున్నట్లు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఇరాన్-అమెరికా వివాదం కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కాకుండా.. హార్ముజ్ జలసంధి, యెమెన్, హౌతీలు, గల్ఫ్ దేశాలు, అంతర్జాతీయ చమురు రవాణాపై ప్రభావం చూపే విస్తృత ప్రాంతీయ సంక్షోభంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: హసీనా అప్పగింతకు భారత్ గడువు ఇవ్వలేదు..


