న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 49వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ వెన్ యు జాంగ్‌తో 35 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సింధు 21–16, 21–17తో గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ఉన్నతి హుడా రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది.
మిచెల్లి లీ (కెనడా)తో జరిగిన మ్యాచ్‌లో ఉన్నతి 21–11, 9–21, 21–23తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో ఆయుశ్ శెట్టి కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–10తో దుమిందు అబేవిక్రమ (శ్రీలంక)పై గెలుపొందాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతాడు. పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న భారత నంబర్‌వన్, ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ అనూహ్య పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
రెండో రౌండ్‌లో లక్ష్య సేన్ 73 నిమిషాల్లో 21–19, 19–21, 17–21తో ప్రపంచ 153వ ర్యాంకర్ గారెత్ టాన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్వి సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి డున్–ప్రింగిల్ (స్కాట్లాండ్) జంట నుంచి ‘వాకోవర్’ లభించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 17–21, 14–21తో కాంగ్ మిన్ హైక్–కి డాంగ్ జు (కొరియా) జంట చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 21–11, 21–11తో లియోంగ్ లోక్ చోంగ్–ఎన్జీ వెంగ్ చి (మకావు) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.


