ప్రాంతీయ భాషల్లో చూసేందుకు మొగ్గు
సినిమా తర్వాత భారతీయులను అత్యధికంగా ఆకట్టుకునే వినోదం క్రికెట్. ముఖ్యంగా ఐపీఎల్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రేజ్‌ను ఆస్వాదించే విధానంలో మాత్రం ఇప్పుడు కొత్త మార్పు కనిపిస్తోంది. టీవీలో మ్యాచ్ చూడటం మాత్రమే కాకుండా.. డిజిటల్ వేదికల్లోనూ తమకు నచ్చిన ప్రాంతీయ భాషలో కామెంటరీ వింటూ ఆటను ఆస్వాదించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాంతీయ క్రికెట్ ప్రముఖులతో స్థానిక భాషల్లో కామెంటరీ చెప్పించే ‘బియాండ్ బౌండరీస్’ ప్రయోగం ఇందుకు మరింత ప్రోత్సాహం ఇచ్చింది.
ప్రాంతీయ భాషల్లో క్రికెట్ చూసే విషయంలో తెలుగు అభిమానులు ముందున్నారు. ఐపీఎల్-2026లో ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో డిజిటల్ వాచ్-టైమ్ షేర్ ఏకంగా 30 శాతం పెరిగింది. ఆ తర్వాత స్థానాల్లో కన్నడ, తమిళ భాషలు నిలిచాయి. దీంతో ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ కామెంటరీకే ఎక్కువగా పరిమితమైన క్రికెట్ వీక్షణం.. క్రమంగా ప్రాంతీయ భాషల వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.
మ్యాచ్‌లో ఏం జరుగుతుందనే దానితో పాటు.. దాన్ని ఏ భాషలో, ఎలాంటి స్థానిక అనుభూతితో చూస్తున్నామన్నది కూడా అభిమానులకు ముఖ్యంగా మారుతోంది. టీవీ అయినా, డిజిటల్ వేదిక అయినా తమకు సుపరిచితమైన భాషలో మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.
12 భాషల్లో.. 160కి పైగా గళాలు!
ఈ మారుతున్న అభిరుచికి అనుగుణంగానే ప్రాంతీయ భాషల్లో కామెంటరీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఐపీఎల్-2026లో తెలుగులో ‘క్రికెట్ విత్ చాయ్’, ‘ఆరెంజ్ ఓ రంగు’ వంటి ప్రత్యేక ఫార్మెట్లను అందించారు. మాజీ క్రికెటర్లు హనుమ విహారి, ఎంఎస్‌కే ప్రసాద్ కూడా తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. కొత్తగా వెలుగులోకి వస్తున్న ప్రతిభావంతులైన ఆటగాళ్లను పరిచయం చేశారు.
తమిళంలో మురళీ విజయ్, ఎల్.బాలాజీ, శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ వంటి ప్రముఖులు కామెంటరీ ప్యానెల్‌లో భాగమయ్యారు. కన్నడలో వినయ్ కుమార్, వేదా కృష్ణమూర్తి వంటి మాజీ క్రికెటర్లు అభిమానులను అలరించారు. ప్రస్తుతం 12 భాషల్లో 160 మందికి పైగా ప్రాంతీయ గళాలు కామెంటరీ అందిస్తున్నాయంటే.. ఈ ధోరణి ఎంతగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీ వైపు మరింత జోరు..
ఇదిలా ఉంటే.. క్రికెట్‌ను టీవీతో పాటు డిజిటల్ వేదికల్లో చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఐపీఎల్-2026 సీజన్‌లో కనెక్టెడ్ టీవీ ద్వారా మ్యాచ్‌లను వీక్షించే వారి సంఖ్య 22 శాతం పెరిగింది. డిజిటల్ వీడియో వ్యూస్ ఏకంగా 2,500 కోట్లకు చేరాయి. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి డిజిటల్ వ్యూస్ 8 శాతం పెరిగాయి.
అన్నింటికంటే ముఖ్యంగా డిజిటల్ వేదికల్లో ప్రాంతీయ భాషల వాచ్-టైమ్ షేర్ దాదాపు 33 శాతం పెరగడం ఆసక్తికరంగా మారింది. అంటే అభిమానులు కేవలం క్రికెట్‌ను చూడటమే కాకుండా.. తమ భాష, తమ ప్రాంతానికి చెందిన క్రికెట్ ప్రముఖులు, తమకు సుపరిచితమైన స్థానిక అనుభూతితో ఆటను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారన్నమాట. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి, పెరుగుతున్న డిజిటల్ వీక్షణానికి తాజా గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: శతక్కొట్టిన శ్రేయస్.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం


