టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధన.. వైస్ కెప్టెన్లుగా షఫాలీ, దీప్తి | Smriti Mandhana named India new captain | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధన.. వైస్ కెప్టెన్లుగా షఫాలీ, దీప్తి

Oct 6 2026 9:55 PM | Updated on Oct 6 2026 9:57 PM

Smriti Mandhana named India new captain

భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన నియమితురాలైంది. బీసీసీఐ ఇవాళ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇవాళ ఉదయమే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటలకే బీసీసీఐ మంధానను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

2013 నుంచి భారత జట్టులో కొనసాగుతున్న మంధానకు ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉంది. ఆమె ఇప్పటివరకు 22 వైట్ బాల్ మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది. అలాగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2024, 2026 సీజన్లలో ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించింది.

టీ20ల్లో మంధాన కెప్టెన్సీ రికార్డు
మంధాన ఇప్పటివరకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించింది. ఇందులో 11 విజయాలు, 6 ఓటములు నమోదు కాగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

వన్డేల్లో మాత్రం మంధానకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆమె కెప్టెన్‌గా వ్యవహరించిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది.

WPLలో ఆర్సీబీకి 35 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మంధాన 18 విజయాలు, 17 ఓటములు నమోదు చేసింది.

వైస్‌ కెప్టెన్లుగా షఫాలీ, దీప్తి
మంధానను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సమయంలోనే జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌లో షఫాలీ వర్మ, వన్డే సిరీస్‌లో దీప్తి శర్మ మంధానకు డిప్యూటీలుగా (వైస్‌ కెప్టెన్‌) వ్యవహరించనున్నారు. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ.. జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపికైంది. 

జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 16, 18, 20 తేదీల్లో రాయ్‌పూర్‌లో జరగనున్నాయి. అనంతరం మూడు వన్డేలు అక్టోబర్ 23, 25, 28 తేదీల్లో వడోదరలో జరుగుతాయి.

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), నికీ ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింటిమణి కలిత, మిన్ను మణి.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రేణుకా ఠాకూర్.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement