రాజకుటుంబానికి దూరమై.. ఆరేళ్ల తర్వాత యువరాజు రాక! | Prince Harrys Return to UK After 6 Years But for Family | Sakshi
Sakshi News home page

రాజకుటుంబానికి దూరమై.. ఆరేళ్ల తర్వాత యువరాజు రాక!

Aug 20 2026 8:54 AM | Updated on Aug 20 2026 8:56 AM

Prince Harrys Return to UK After 6 Years But for Family

బ్రిటన్‌ రాజకుటుంబంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయిన ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌ మళ్లీ బ్రిటన్‌కు తిరిగి రానున్నారు. పిల్లల చదువు కోసం ససెక్స్‌ దంపతులు బ్రిటన్‌లో ఎక్కువ కాలం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం కుటుంబ అవసరాల కోసమా? లేదంటే రాజకుటుంబంతో సంబంధాల పునరుద్ధరణకు అడుగులా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ తమ పిల్లలు ప్రిన్స్‌ ఆర్చీ (7), ప్రిన్సెస్‌ లిలిబెట్‌ (5)తో కలిసి ఈ నెలలోనే బ్రిటన్‌కు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో పిల్లలు బ్రిటన్‌లోని పాఠశాలలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీంతో ససెక్స్‌ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియా జీవితం నుంచి కొంతకాలం పాటు బ్రిటన్‌ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హ్యారీ–మేఘన్‌ రాజకుటుంబానికి చెందిన ‘వర్కింగ్‌ రాయల్స్‌’గా మాత్రం తిరిగి వ్యవహరించబోరని తెలుస్తోంది. కేవలం స్వతంత్ర సభ్యులుగానే కొనసాగుతారని.. రాజభవనంలో కాకుండా ప్రత్యేక నివాసంలో ఉండే అవకాశం ఉందని బ్రిటన్‌ టాబ్లాయిడ్‌లు కథనాలు ఇస్తున్నాయి..

అసలు ఆరేళ్ల క్రితం ఏం జరిగింది?
హ్యారీ–మేఘన్‌ దంపతులు 2020 జనవరిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా తమ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అనంతరం వారు అమెరికాకు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలో స్థిరపడిన ఈ దంపతులు అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సుమారు 14.7 మిలియన్‌ డాలర్ల విలువైన భవనంలో నివసిస్తూ.. మీడియా ప్రాజెక్టులు, వ్యాపార ఒప్పందాలతో తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కొనసాగించారు.

సంచలన ఆరోపణలు?
హ్యారీ–మేఘన్‌ నిర్ణయం వెనుక రాజకుటుంబంలో ఎదురైన ఒత్తిళ్లు, మీడియా వ్యవహారాలు ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా మేఘన్‌ రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. 2021లో ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజభవనంలో తనకు ఎదురైన ‘చేదు’ అనుభవాల్ని వివరిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. హ్యారీ కూడా తన తండ్రి కింగ్‌ చార్లెస్‌, అన్న ప్రిన్స్‌ విలియమ్‌తో తన సంబంధాల్లో వచ్చిన విభేదాలను వెల్లడించారు. 2023లో విడుదలైన తన ఆత్మకథ ‘స్పేర్‌’లో విలియమ్‌తో విభేదాలను ప్రస్తావించడం మరింత సంచలనంగా మారింది.

మధ్యలో బ్రిటన్‌కు వచ్చినా.. 
అమెరికాకు వెళ్లిన తర్వాత హ్యారీ పలుమార్లు బ్రిటన్‌కు వచ్చారు. ముఖ్యంగా తన తండ్రి కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేకం సందర్భంగా 2023లో లండన్‌కు వచ్చారు. అలాగే రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియల సమయంలో 2022లో కూడా కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో ఉన్నారు. ఇటీవల కూడా హ్యారీ–మేఘన్‌ పిల్లలతో కలిసి బ్రిటన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కింగ్‌ చార్లెస్‌కు ఆర్చీ, లిలిబెట్‌లను కలిసే అవకాశం లభించింది.

ఇకపై ఏం జరగొచ్చు?
తాజా నిర్ణయం రాజకుటుంబంలో పూర్తిస్థాయి పునరాగమనంగా భావించడం లేదు. హ్యారీ–మేఘన్‌ ఇకపై కూడా ‘నాన్‌ వర్కింగ్‌ రాయల్స్‌’గానే కొనసాగనున్నారు. రాజకుటుంబ అధికారిక కార్యక్రమాల్లో వారికి మళ్లీ కీలక పాత్ర ఉండకపోవచ్చని సమాచారం.

మరోవైపు హ్యారీకి సంబంధించిన భద్రతా వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్రిటన్‌లో ఆయనకు కల్పించే భద్రతపై వివాదం చెలరేగింది. దీనిపై కోర్టులో పోరాడిన హ్యారీకి అనుకూల ఫలితం రాలేదు. అయితే తండ్రి కింగ్‌ చార్లెస్‌తో సంబంధాలు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అన్న ప్రిన్స్‌ విలియమ్‌తో ఉన్న దూరం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement