ప్రార్థన చేసుకుంటానని వెళ్లి.. వెనక నుంచి దాడిచేశాడు | Pretext of offering prayers and attacked says Captain Smit Machchhar | Sakshi
Sakshi News home page

ప్రార్థన చేసుకుంటానని వెళ్లి.. వెనక నుంచి దాడిచేశాడు

Oct 5 2026 5:19 AM | Updated on Oct 5 2026 5:19 AM

Pretext of offering prayers and attacked says Captain Smit Machchhar

ఒకసారి తలుపు తెరిస్తే మూసేశాడు 

మళ్లీ శక్తినంతా కూడదీసుకుని మరోసారి తలుపు తెరిచా

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌ సంభాషణ వేళ దాడి వివరాలను వెల్లడించిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌

ముంబై: ప్రార్థన చేసుకుంటానని వెనక్కి వెళ్లిన వ్యక్తి అనూహ్యంగా మెరుపుదాడి చేశాడని  ఫ్లై దుబాయ్‌ ఘటనలో వందల మందిని కాపాడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌... కోపైలట్‌ దారుణ దాడి ఘటనను వివరించారు. అబూదాబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్ఛార్‌తో శనివారం ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోజు కాక్‌పిట్‌లో ఘటన జరిగిన క్రమాన్ని పూసగుచ్చినట్లు నెతన్యాహూకు మచ్ఛార్‌ వివరించారు. 

‘‘ అది సాధారణ విమాన ప్రయాణంగానే మొదలైంది. కాక్‌పిట్‌లో నాతోపాటు ఉన్న కో–పైలట్‌ ప్రార్థన చేసుకుంటా అని చెప్పాడు. నా వెనక వైపు వెళ్లాడు. అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చూడటం ఎందుకు అని భావించి గౌరవసూచకంగా నేను వెనుక వైపు అస్సలు చూడలేదు. నాలుగైదు నిమిషాల తర్వాత హఠాత్తుగా నా తల వెనుక భాగంలో ఒక బలమైన దెబ్బ తగిలింది. విమానం కాక్‌పిట్‌లో ఏదో కూలిపోయి నా మీద పడిందేమో, ఏదో తీవ్రమైన ప్రమాదం మొదలైందని భావించా. 

కానీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వెంటవెంటనే గొడ్డలి లాంటిదేదో నా వీపు, తలను బలంగా తాకుతోంది. కోపైలట్‌ విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే అతడిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించా. అతడు కొట్టిన దెబ్బల ధాటికి ఒక్కసారిగా నా చూపు మసకబారింది. విమానం నా అ«దీనంలోంచి తప్పిపోయి వేగంగా కిందకు పడిపోతోందని అర్థమైంది. ఆ క్షణాలు నాకింకా గుర్తు. కాక్‌పిట్‌ తలుపును తెరిచా. 

కానీ కో–పైలట్‌ వెంటనే దానిని మూసేశాడు. గాయాలతో కాక్‌పిట్‌ నేలపై పడిపోయా. విమానం కిందుకు దూసుకెళ్తున్న వైనం, గాలి హోరు, ప్రయాణికుల ఆర్తనాదాలు గట్టిగా విన్పిస్తూనే ఉన్నాయి. ఇదే నా చివరి విమాన ప్రయాణమేమో అని అన్పించింది. కానీ నాలో ఇంకా చివరి పోరాటానికి సరిపడా శక్తి మిగిలే ఉంది. వెంటనే శక్తినంత కూడదీసుకుని కాక్‌పిట్‌ తలుపు తెరిచా. అదృష్టవశాత్తూ ప్రయాణికులు అప్పటికే తలుపు అవతలివైపు నిల్చుని బలంగా లోపలికి దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 

తలుపు తెరుచుకోగానే ఉక్క ఉదుటున వాళ్లు లోపలికి వచ్చి కోపైలట్‌ చేతులు విరిచి పట్టుకున్నట్లు నాకు లీలగా గుర్తుంది. కాక్‌పిట్‌ తలుపునకు లోపలి వైపున ఒక నాబ్‌(తిప్పే పరికరం) ఉంటుంది. బయటి వైపు నుంచి దీనిని కేవలం ఒక కోడ్‌ ద్వారానే తెరవగలరు. బయట ఉన్న విమాన క్రూ సిబ్బంది ఈ కోడ్‌ను టైప్‌చేసి తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ కో–పైలట్‌ అది తెరచుకోకుండా అడ్డుకున్నాడు. కాక్‌పిట్‌ తలుపు తెరవడానికి ఏకైక మార్గం ఆ నాబ్‌ను పట్టుకుని తిప్పడమే. అది నా చేతికి తగలగానే వెంటనే తిప్పేసి తలుపు తెరిచాను’’ అని మచ్ఛార్‌ వివరించారు. పోరాడకుండానే ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు.

మీరు ప్రపంచ హీరో  
స్మిత్‌ మచ్ఛార్‌ ప్రపంచ హీరో అని నెత న్యాహు కొనియాడారు. మచ్ఛార్‌తో ఆయన సంభాషణ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జ్యోతిని వెలిగించడానికి మచ్ఛార్, భారత ప్రధాని మోదీని నెతన్యాహు ఆహ్వానించారు. ఇది తమ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇస్తున్న అత్యున్నత గౌరవం అని చెప్పారు. సాధారణంగా ఇజ్రాయెల్‌ పౌరులకే ఇలాంటి గౌరవం దక్కుకుంది. విదేశీ పౌరులకు జ్యోతి వెలిగించే అవకాశం కల్పించడం అత్యంత అరుదుగానే జరుగుతుంది. ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిఏటా ఏప్రిల్‌ చివరిలో లేదా మే ప్రారంభంలో... హీబ్రూ నెల ఇయార్‌లో ఐదో రోజున నిర్వహిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement