పోలాండ్‌లో కూలిన రష్యా క్షిపణి.. నాటో అప్రమత్తం! | Russian Missile Crashes In Poland | Sakshi
Sakshi News home page

పోలాండ్‌లో కూలిన రష్యా క్షిపణి.. నాటో అప్రమత్తం!

Nov 20 2026 11:42 PM | Updated on Nov 20 2026 11:53 PM

Russian Missile Crashes In Poland

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మరోసారి ఐరోపా దేశాల్లో ఆందోళన రేపింది. రష్యా ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణి పోలాండ్‌ గగనతలంలోకి ప్రవేశించి గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. మరో రెండు అనుమానాస్పద వస్తువులు కూడా గగనతలాన్ని ఉల్లంఘించాయి. ఈ ఘటనను పోలాండ్‌ తీవ్రంగా పరిగణించింది.

పోలాండ్‌ ఆగ్నేయ ప్రాంతంలోని నోవీ లిపోవిక్‌ వద్ద శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఖ్‌–101 క్రూయిజ్‌ క్షిపణి కూలింది. ఉక్రెయిన్‌ సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు.. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.

మరో అనుమానాస్పద క్షిపణి రుడ్నిక్‌ నాడ్‌ సానెమ్‌ ప్రాంతంలో కూలగా.. జెట్‌ ఇంజిన్‌తో నడిచే డ్రోన్‌ మొలోడిచ్‌ సమీపంలో పడిపోయింది. దీంతో పోలాండ్‌ గగనతల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ ఘటన రష్యా రెచ్చగొట్టే చర్యగా పోలాండ్‌ ఆరోపించింది. దీంతో నాటో యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలో పోలాండ్‌ ఆగ్నేయ ప్రాంతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ నేతృత్వంలో ‘కొయలిషన్‌ 2026’ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. 11 దేశాలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం ఉక్రెయిన్‌లో భవిష్యత్తు శాంతి ఒప్పందానికి సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్షిపణులు, డ్రోన్‌ పోలాండ్‌ గగనతలంలోకి రావడం యాదృచ్ఛికం కాదని ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు రష్యా దాడుల్లో శుక్రవారం ఉక్రెయిన్‌లో కనీసం ఎనిమిది మంది మరణించారు. పోలాండ్‌కు అదనపు మద్దతు కోరనున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. అలాగే మోల్డోవా గగనతలంలోకి కూడా ఓ డ్రోన్‌ ప్రవేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం పొరుగు దేశాల భద్రతపైనా పడుతుండటంతో ఐరోపాలో ఆందోళన పెరుగుతోంది.

ఇదీ చదవండి: జెన్సెన్‌ను వెనక్కి తీసుకొద్దాం : మరో దిగ్గజం మద్దతు, వినూత్న పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement