అబుదాబీలో ముగిసిన రష్యా, ఉక్రెయిన్ చర్చలు
అబుదాబీ: అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన చర్చల్లో ముందడుగు పడింది. యుద్ధ ఖైదీల భారీ మార్పిడికి ఇరుపక్షాలు అంగీకరించాయని అధికార వర్గాలు తెలిపాయి. యూఏఈ రాజధాని అబు దాబీలో రెండు రోజులపాటు జరిగిన చర్చలు బుధవారం ముగిశాయి.
ఖైదీల విడుదలకు అంగీకారం కుదిరిందని, కచ్చితమైన సంఖ్యలను గురువారం ఖరారు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, అమెరికా ప్రతినిధి బృందంలోని సభ్యుడు జేర్డ్ కుష్నర్ పేర్కొన్నారు.
ఖైదీల మార్పిడి అంశాన్ని రష్యా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ, ఉక్రెయిన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన రుస్తెం ఉమెరోవ్ సైతం ధ్రువీకరించారు. దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్‌లు ఎప్పటికప్పుడు ఖైదీలను మార్చుకుంటూ వచ్చాయి. మిగిలిన ఖైదీల మార్పిడికి అంగీకారానికి వచ్చాయి.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేకపోయిన శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్‌తోపాటు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి గురువారం మాస్కోకు వెళ్తామని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలవడానికి డబ్లిన్‌కు వెళ్తామని జేర్డ్ కుష్నర్ చెప్పారు.
ఒకవైపు అబుదాబీలో చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య దాడులు ఆగడం లేదు. రెండు దేశాలు సుదూర క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లోని దక్షిణ జపోరిజియా ప్రాంతం, తూర్పు నగరమైన ఖర్కివ్‌పై రష్యా సైన్యం దాడికి దిగింది.ఈ దాడిలో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. తమ వైమానిక రక్షణ దళాలు 627 ఉక్రెనియన్ డ్రోన్లను కూలి్చవేశాయని, వాటిలో 150 డ్రోన్లు సెయింట్ పీటర్స్‌బర్గ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


