ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి కుమార్ దివాకర్ తీర్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత నాలుగు నెలల్లో ఆయన 10 హత్య కేసుల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విచారణలో ఉన్న మరణశిక్ష, జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న సుమారు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. అందుకు కారణం ఏంటో కూడా చెబుతున్నారు.
ముజఫర్‌నగర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న కేసులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి ప్రకారం.. ఈ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉందన్న ఆందోళన న్యాయవాదులు, కక్షిదారుల్లో నెలకొంది.
ఎవరీ రవి కుమార్ దివాకర్?
46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో అజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం న్యాయ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బీకామ్, ఎల్‌ఎల్‌ఎం పట్టాలు పొందిన ఆయన 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. 2022లో వారణాసిలోని జ్ఞాన్‌వాపి సముదాయంలో వీడియో సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
నాలుగు నెలల్లో 22 మరణశిక్షలు..
రవి కుమార్ దివాకర్ ఇటీవల వరుసగా సంచలన తీర్పులు వెలువరించారు. ఆగస్టు 13న 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధించారు. షామ్లీ జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో 2014లో పవన్ కుమార్ ఇంటిపై దాడి చేసి కాల్పులు జరిపిన కేసులో రామ్‌వీర్, రాజీవ్, రాహుల్, హరేంద్ర కుమార్‌లను దోషులుగా తేల్చారు.
అంతకుముందు ఆగస్టు 12న 1999లో రూ.5 లక్షల విమోచన కోసం కలప వ్యాపారి సలీంను కిడ్నాప్ చేసి హత్య చేసిన షహనవాజ్‌కు ఉరిశిక్ష విధించారు. దాదాపు 27 ఏళ్ల నాటి కేసులో ఈ తీర్పు వెలువడింది. జూలై 17న 2011లో దోపిడీకి ప్రయత్నిస్తూ రైతు రాజ్‌సింగ్‌ను హత్య చేసిన కేసులో నలుగురికి మరణశిక్ష పడింది. జూలై 6న పంచాయతీ ఎన్నికల కక్షల నేపథ్యంలో 2010లో రాజ్‌బీర్ సింగ్‌ను హత్య చేసిన కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అతని సహచరుడికి ఉరిశిక్ష విధించారు. ఈ కేసు ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైనది’ అని కోర్టు అభిప్రాయపడింది.
విధుల్లో ఉన్న హోంగార్డును హత్య చేసిన కేసులోనూ..
2020లో విధుల్లో ఉన్న హోంగార్డు రతిరామ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన దీపక్‌కు జూలై 2న మరణశిక్ష విధించారు. తన తల్లిపై దాడి చేసిన నిందితుడిని అడ్డుకునేందుకు రతిరామ్ ప్రయత్నించడంతో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో గజేంద్ర, రామ్‌కిరణ్‌లకు ఉరిశిక్ష విధించారు. మే 30న 15 ఏళ్ల నాటి డబుల్ మర్డర్ కేసులో 50 ఏళ్ల రహీస్‌కు మరణశిక్ష పడింది. అతడు రాజేశ్ దేవి, ఆమె ఆరేళ్ల కుమారుడు హిమాంశును ఇటుకలతో కొట్టి చంపినట్లు కోర్టు నిర్ధారించింది.
ఏప్రిల్ 28న 2019 నాటి హత్య కేసులో ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 6న రూ.45 లక్షల ఆర్థిక వివాదం నేపథ్యంలో న్యాయవాది మహ్మద్ సమీర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధించారు.
ఎందుకింత చర్చ?
ఒకే న్యాయమూర్తి నాలుగు నెలల వ్యవధిలో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించడం న్యాయ వర్గాల్లోనే కాదు.. ఇటు దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మరణశిక్ష అనేది ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైన’ కేసుల్లోనే విధించాల్సిన గరిష్ఠ శిక్ష కావడంతో.. ఈ తీర్పులపై ఆసక్తి నెలకొంది. అయితే మరణశిక్ష విధించినంత మాత్రాన వెంటనే ఉరి అమలు జరగదు. భారత న్యాయవ్యవస్థలో ఇటువంటి తీర్పులకు తదుపరి న్యాయపరమైన దశలు ఉంటాయి. అప్పీళ్లు, ఉన్నత న్యాయస్థానాల పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తుది పరిణామం ఉంటుంది. ఈ నేపథ్యంలో దివాకర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సుమారు 100 కేసుల బదిలీ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


