కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్‌ జగన్‌ | DSC Scam: Audio Video Tapes Out, Accused Shielded Says Jagan | Sakshi
Sakshi News home page

కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్‌ జగన్‌

Aug 20 2026 12:53 PM | Updated on Aug 20 2026 1:04 PM

DSC Scam: Audio Video Tapes Out, Accused Shielded Says Jagan

సాక్షి, తాడేపల్లి:  స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్‌లు ఒప్పుకున్నారు. ఎంతో  సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?.. 

ఎఫ్‌ఐఆర్‌ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్‌ అని రాశారు. అరెస్ట్‌ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ బయటకు వచ్చింది. ఆ నెంబర్‌ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

డీఎస్సీలో జాబ్‌ ఇస్తారని ఓ మహిళా అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆపై మోసం చేశారు. ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తారని మభ్య పెట్టారు. ఆమె తనను మోసం చేశారని కంప్లయింట్‌ చేశారు. ఎవరికి రూ.14 లక్షలు ఇచ్చారో అనేది కూడా ఉంది. డీఎస్సీ అని పేర్కొనకుండా.. ఏపీ టూరిజంలో మోసం చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. గతేడాది నవంబర్‌లోనే ఇది జరిగితే.. ఇప్పటిదాకా ఎలాంటి కేసు లేదు. కేసులో పురోగతి లేదని ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవే కాదు.. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. కానీ, ఇక్కడ నారా లోకేశ్‌తో చంద్రబాబు రాజీనామా చేయట్లేదు. పైగా మరింత దిగజారిపోయారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారు. కానీ, ఆ వ్యవహారం అయన ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్‌ జరిగింది.

ఆక్రోశంతో దుష్ప్రచారం
2019కి ముందే బాబు హయాంలో ఆ నోటిఫికేషన్‌ వచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టకముందే(2019 మే 26న).. ప్రిలిమ్స్‌ జరిగాయి. మేం ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకు మెయిన్స్‌ మాత్రమే నిర్వహించాం. ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా డిజిటల్‌ వాల్యూయేషన్‌ జరిపించాం. అయితే కొంత మంది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా మాన్యువల్‌ వాల్యూయేషన్‌ చేయాలని కోర్టు చెప్పింది. అలా చేశాకే.. నియామకాలు జరిపాం. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?. 

అయితే చంద్రబాబు ప్రభుత్వం.. డిజిటల్‌ వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయని అంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పక్కన పెట్టాక ఆ ప్రస్తావన మళ్లీ ఎందుకు వస్తోంది?. అంటే.. ఇది 165 మంది జీవితాలను అతలాకుతలం చేసే ప్రయత్నమా?. ఇదే గ్రూప్‌-1 వ్యవహారంపై నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. 2025లో సిట్‌ వేశారు. ఆ సిట్‌ అధికారులు ఏ తప్పు జరగలేదని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇరికించే కుట్రలో భాగంగా మరో సిట్‌ వేశారు. సిట్‌లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసేవారే కదా?. నిజాలను ఎవరూ దాచిపెట్టలేరు.. బయటకు రావాల్సిందే. 

మా హయాంలో ఇప్పటి డీఎస్సీ మాదిరి ఏ స్కాంలు జరగలేదు. మేమేం పరీక్షలే నిర్వహించకుండా.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికీ అనుకూలంగా జీవోలు తేలేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు.. బేరసారాలు జరిగినట్లుగా.. ఆడియో, వీడియోలు ఇలాంటి ఆధారాలేవీ బయటకు రాలేదు. మా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబుకి ఈ ఆక్రోశం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

డీఎస్సీలో లీకేజీల నుంచి  బేరసారాల వరకు పరిశీలించాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement