సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన డీఎస్సీ అవకతవకలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కనీసం అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం లేదా? అని అన్నారు. ‘‘చదువు చెప్పే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చంద్రబాబు, లోకేశ్ మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేదా?’’ అని మండిపడ్డారు.
స్పోర్ట్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్‌మెంట్‌లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు.
అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని దేశానికి ఎన్నో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరని ఆయన అన్నారు. కానీ అదే పేరుతో సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.
పీవీ సింధు స్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు ఎంతమంది? దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించినవారు ఎంతమంది? అనేది చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అర్హతలు, వారు సాధించిన పతకాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.


