ఎదురుచూసిన పేదలకు తీవ్ర నిరాశ పాత పింఛన్లకే నిధులు పరిమితం కొత్త దరఖాస్తుదారులపై స్పష్టత కరవు జిల్లాలో 10,768 దరఖాస్తులు తిరస్కరణ ఆమోదం పొందిన 46,187 మందికీ రిక్తహస్తమే
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో, తమకు సామాజిక పింఛను అందుతుందని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు తీవ్ర నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ నెల ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ, కేవలం పాత పింఛనుదారులకే నిధులను పరిమితం చేస్తూ కొత్త దరఖాస్తుల ఊసే ఎత్తకపోవడంపై లబ్ధిదారులు భగ్గుమంటున్నారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, నిరుపేదల నోటికాడ కూడు లాగేసేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజాగా విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, గుంటూరు జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం 2,50,224 మంది పాత పింఛనుదారులకే రూ.109.44 కోట్ల నిధులను కేటాయించారు. మొత్తం 566 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల పరిధిలో 4,328 మంది పంపిణీ అధికారులను ఇందుకోసం కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ నిధుల్లో ఒక్క రూపాయి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి విడుదల చేయకపోవడం పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మరోవైపు, జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం మొత్తం 57,548 మంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే, అధికారులు నిబంధనల పేరుతో గత నెల 27వ తేదీ నాటికి ఏకంగా 10,768 దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా 7,229 దరఖాస్తులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,539 దరఖాస్తులను పక్కన పెట్టేశారు. కేవలం గుంటూరు నగరంలోనే 3,061, మంగళగిరి–తాడేపల్లి పరిధిలో 2,529, తెనాలిలో 1,054 దరఖాస్తులను కొట్టివేశారు. మరో 593 దరఖాస్తులను ఇప్పటికీ పరిశీలన పేరుతో పెండింగ్‌లోనే మూలన పడేశారు. కొద్దిరోజుల క్రితం పింఛన్ స్టేటస్ చూసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఆ తరువాత ఆ ఆప్షన్‌ను కూడా ఎత్తివేసింది. దీంతో కొత్త పింఛన్లు ఇవ్వరేమో అని లబ్ధిదారులు ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి, జిల్లాలో 46,187 మంది దరఖాస్తులను అధికారికంగా ఆమోదించారు. వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించినా, ప్రస్తుత బడ్జెట్‌లో వీరికి ఎటువంటి నిధులూ కేటాయించలేదు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేవు. పింఛను సొమ్ము ఎప్పుడు అందుతుందో తెలియక బాధితులు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కూటమి సర్కారు తమను నిలువునా మోసం చేసిందని వాపోతున్నారు. అర్హులైన వారందరికీ తక్షణమే పింఛను సొమ్మును విడుదల చేయాలని జిల్లాలోని నిరుపేదలు డిమాండ్ చేస్తున్నారు.


