అభిప్రాయం
వచ్చే నెల సెప్టెంబర్‌లో భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్‌లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్‌పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.
అయినా... వాణిజ్యం పెరిగింది!
సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.
చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం
1962 తర్వాత భారత్‌పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్‌కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.
భారత్ ఏం చేయ్యాలి?
గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్‌ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్‌ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్‌ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్‌ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్‌ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్‌తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.
భారత్‌కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్‌ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


