మాధవ్ శింగరాజు
జీవితంలో ఏది లేకున్నా, పరుగైతే ఉండాలి. పరుగు అంటే ఆశయం. ఆశయం లేకపోతే ఊపిరి లేనట్లే. నువ్వు 400 మీటర్ల ‘ఫినిష్ లైన్’ను టచ్ చేశావంటే అది రికార్డ్‌ను సెట్ చేయటమైనా అయుండాలి, లేదంటే, రికార్డ్‌ను బ్రేక్ చేయటమైనా అయుండాలి. ట్రాక్ మీద ఉన్నంతవరకు నీ అడుగులు నీ గుండెలో కొట్టుకుంటూనే ఉండాలి. హర్డిల్స్ ఉంటాయి. ఎగిరి దూక వలసిందే; బర్డెన్స్ ఉంటాయి. పరుగులు సాగవలసిందే. నువ్వొక చిన్న గ్రామంలో పుట్టొచ్చు. పేద కుటుంబంలోని ఆరుగురు పిల్లల్లో నువ్వొకరు కావచ్చు. నీ ఆశను మీ నాన్న తన భుజాల మోస్తున్నప్పుడు; నిన్ను కన్నట్లే నీ కలను కూడా మీ అమ్మ తన ఒడిలో కంటున్నప్పుడు నీ పరుగును ఇక ఆపేదెవరు?!
స్పైక్ షూస్ లేవు. నీ ఉత్త కాళ్లు నీకు లేవా?! రబ్బర్ ట్రాక్‌లు లేవు. మీ ఊళ్లో పొలాల గట్లు లేవా, రైలు పట్టాల రోడ్డు లేదా, సముద్ర తీరం లేదా?! గట్ల ఎగుడు దిగుళ్లు, పట్టాల కంకర గుట్టలు, తీరంలో ఇసుక దిబ్బలు... ఎంత బలం నీ కాళ్లకు! ఎంత వేగం నీ పాదాలకు! ఎన్ని స్ప్రింగులు నీ దూకుడుకు! సౌకర్యాలు లేవు. సదుపాయాలు లేవు. పోటీలకు వెళ్లాలి. రిజర్వేషన్ టిక్కెట్లు లేవు. కిక్కిరిసిన రైలు బోగీలో కూలబడటానికైనా చోటు లేదు. బస్సులో సీటు లేదు. మైళ్లకు మైళ్లు నిలబడుకుంటూనే నీ ప్రయాణం మొత్తం! నిద్రకు లోబడ్డావా నీ స్టేషన్ దాటిపోతుంది. నీ స్క్రాచ్ లైన్‌లో నువ్వు లేకుండానే స్టేడియంలో పిస్టల్ బ్యాంగ్ మోగుతుంది. పడుతూలేస్తూ కాదు, పరుగులు పెడుతూ నువ్వు నీ ట్రావెల్ బ్యాగ్‌ను విసిరికొట్టి నీ ట్రాక్‌ను రీచ్ అవ్వాలి. రెఫరీ ‘అన్ యువర్ మార్క్స్’ అనగానే, నిలబడి నిలబడి ఉన్న నీ కాళ్లను బ్లాక్స్‌పై బలంగా మోపాలి. తూలుతున్న నీ శరీరాన్ని ముందుకు వంచి, గాలి వేగంతో దూసుకెళ్ల డానికి సిద్ధం కావాలి. విజయం నీదే అవ్వాలి.
జీవితం నిన్ను పెట్టించే పరుగుల ముందు, నువ్వు తీసే 400 మీటర్ల పరుగెంత? నువ్వు లాస్ ఏంజెల్స్ వెళ్తున్నావ్!! నీకు డైటీషియన్‌లు లేరు. నీకంటూ చెఫ్‌లు లేరు. వెళ్లిన చోట నువ్వు బ్రెడ్ తినాలి. బటర్ తినాలి. వేయించినవి ఇంకేవో తినాలి. తినలేవు. తింటే కడుపు అప్‌సెట్ అవుతుంది. కళ్లు తిరగొచ్చు. కాళ్లు తడబడొచ్చు. ఇంటి నుంచి బియ్యం తీసుకెళ్లు. బియ్యంతో నీ హోటల్ గదిలోనే గంజి చేసుకో. నిమ్మ ఊరగాయ చప్పరిస్తూ ఆ అమృతంతో ఆకలి తీర్చుకో. ప్రపంచ ఛాంపియన్లకు గట్టి పోటీ ఇవ్వటానికి ఆ మాత్రం సత్తువ సరిపోదా? నీ మనోబలం ఎలాగూ ఉంటుంది. అసలు మీ ఊళ్లోనే నీ ఆశకు ఎన్నిఅడ్డంకులు! అందమైన నీ కలల్లోకి గుంపులు గుంపులుగా ఎన్నెన్ని దయ్యాలు!
‘‘అమ్మాయి పరుగెత్తటం ఏంటి?!’’ అంటారు. నువ్వు మౌంటెనీర్ అవాలనుకుంటే, ‘‘అమ్మాయి కొండలెక్కటం ఏంటి?!’’ అంటారు. నువ్వు స్పోర్ట్స్ వేర్ తొడుక్కుంటే, ‘‘అమ్మాయి పొట్టి దుస్తులు వేసుకోవడం ఏంటి?!’’ అంటారు. అని ఊరుకోరు!మీ ఇంటికి వస్తారు. ‘‘పిల్లని అలా వదిలేశారేంటి?’’ అని మీ అమ్మానాన్నను నిలదీస్తారు. మీ చెల్లెళ్ల వైపు చూసి, ‘‘మీరూ మీ అక్కలా తయారవకండి’’ అంటారు. ఏదెలా ఉన్నా నీ పరుగు ఆగకూడదు. ఎం.డి. వలసమ్మ 58.47 నిమిషాల రికార్డును పి.టి. ఉష బ్రేక్ చేయాలి. పి.టి. ఉష 55.42 నిమిషాల రికార్డును, విద్యా రామ్‌రాజ్ బ్రేక్ చేయాలి. విద్యా రామ్‌రాజ్ 54.75 నిమిషాల రికార్డును మరొక అమ్మాయి వచ్చి బ్రేక్ చేయాలి. ‘రిలే రేస్’ బ్యాటన్‌ని ఒకరి చేతికి ఒకరు అందించుకున్నట్లు, తరం నుంచి తరానికి అమ్మాయిలు ఒకరి ‘ఊపిరి’ని ఒకరు గుప్పెట పట్టాలి. ఒక్క అంగలో వెళ్లి కలల కాంతి రేఖపై తమ పాదముద్ర వేయాలి.


