breaking news
madhav shingraju
-
నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని) రాయని డైరీ
యుద్ధాన్ని మొదట ప్రారంభించిన వారే శాంతి కోసం మొదట ప్రయత్నం చేసినవారు అవుతారు. అయితే వారికి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా అన్నది నేనెప్పుడూ ఆలోచించని విషయం.వార్స్, ఆపరేషన్స్, బ్యాటిల్స్... ఇన్నిటితో ఎన్నేళ్ల యుద్ధం చేసినా శాంతి సిద్ధిస్తుందని చెప్పలేం. శాంతిని కోరుకునేవారు నిరంతరం యుద్ధయజ్ఞం చేస్తూనే ఉండాలి. శాంతిని కాపాడుకుంటూ ఉండటమే శాంతి స్థాపన.శుక్రవారం, తెల్లారకుండానే 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ ఇరాన్‌తో శాంతి ప్రయత్నాలు ప్రారంభించింది. ఏవైనా రెండు దేశాలు టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చొని శాంతి కోసం జరుపుకొనే చర్చల కంటే – ఎవరి దేశంలో వారు, ఎవరి ‘వార్ రూమ్’లో వారు కూర్చొని శతఘ్నులను ఒకరి వైపు ఒకరు విసురుకోవటం వల్లనే ఎప్పటికైనా శాంతిని సాధించగలమని నా నమ్మకం. శాంతి కోసం జరిగే చర్చలు ఎంత వికారంగా ఉంటాయో చూడండి. చర్చలకు కూర్చున్నాక కదా కండిషన్స్ అనేవి! అసలు చర్చలకు కూర్చోటానికే కండిషన్స్ పెట్టేస్తారు! శాంతి కోసమా చర్చలు? లేక, మా నుదుటి మీద మేము పిస్టల్ గురి పెట్టుకుని కాల్చుకోవటం కోసమా?!చర్చలకు ముందు చర్చలు. సంప్రదింపు లకు ముందు సంప్రదింపులు. రాయబారా లకు ముందు రాయబారాలు. రాకపోకలకు ముందు రాకపోకలు. ఈ మధ్యలో శాంతి ఎక్కడో చేజారి జారిపోతుంది. ఇంటర్నల్ కేబినెట్ మీటింగ్స్‌లో నా కొలీగ్స్‌తో నేనిదే చెబుతాను. ‘‘చూడండి, నాకేం కావాలన్న దానిపై నాకు క్లారిటీ ఉంది. నాకు శాంతి ప్రక్రియలు అవసరం లేదు. శాంతి ఫలితాలు కావాలి’’ అని అంటాను.శాంతి కోసం ఐక్యరాజ్య సమితి చేసే ప్రయత్నాలైతే పరమ పావనంగా ఉంటాయి! గడాఫీని తీసుకెళ్లి ‘యూఎన్ హ్యూమన్ రైట్స్’కి చైర్మన్‌గా కూర్చోబెడుతుంది. సద్దాం హుస్సేన్ని పిలిపించుకుని ‘యూఎన్ నిరాయుధీకరణ’కు అధ్యక్షుడిని చేస్తుంది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ‘‘తప్పు కదా మిత్రమా’’, ‘‘తగదు కదా నా ప్రియ దేశమా!’’ అంటోంది. యూఎన్‌కు నేను ఒకటే చెబుతాను. ‘‘మీరు ‘పీస్ టాక్స్’తో చేయలేని పనిని మేము ‘పీస్ ఎటాక్స్’తో చేస్తున్నాం’’ అని! ఇంకొకటి కూడా చెబుతాను. ఇరాన్ అణ్వాయుధాలను పోగు చేసుకుంటోంది. ఆ పోగు నిన్న ఉన్నట్లుగా నేడు లేదు. వారం క్రితం ఉన్నట్లుగా నిన్న లేదు. నెల క్రితం ఉన్నట్లుగా వారం క్రితం లేదు. ఏడాది క్రితం ఉన్నట్లుగా నెల క్రితం లేదు. పోగు కుప్ప అయింది. కుప్ప గుట్ట అయింది. గుట్ట దిబ్బ అయింది. ఆ దిబ్బ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు థ్రెట్ అయింది. నా ప్రశ్న ఒక్కటే – ఇరాన్‌కు రెడ్ లైన్స్ గీసేందుకు నిరాకరించే వారికి, ఇజ్రాయిల్ ముందు రెడ్ లైట్ పెట్టే నైతిక హక్కు ఉంటుందా? అని. అనేక విషయాల్లో నన్ను తప్పుపట్టే ప్రపంచానికి అనేకానేక విషయాల్లో నేను కరెక్ట్ అనీ తెలుసు. కానీ ఒప్పుకోదంతే! ఏదైనా దేశం ‘రాక్ బాటమ్’కి చేరుకుందంటే ఇక అక్కడేం మిగల్లేదని అర్థం.మంచీ చెడ్డ, నీతీ నియమం, ఆశా శ్వాస...ఏమీ మిగల్లేదని. అలాంటి దేశాన్ని కలుపుకోనన్నా కలుపుకోవాలి. లేదా యుద్ధ ట్యాంకుల్ని పెట్టి కలుపునైనా ఏరి పారేయాలి. హఠాత్తుగా భారీ విస్ఫోటనం! జెరూసలేంలో నేనున్న గది ఒక్కసారిగా దద్దరిల్లింది. కిటికీ అద్దాలు బద్దలయ్యాయి. సమీపంలో – ‘‘కొడుకా... నాయనా...’’ అని ఓ తల్లి ఆక్రందన! ఇరాన్ నుంచి ఖొమైనీ తిరుగుయుద్ధం ప్రారంభించినట్లున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపదు. ఒక తల్లి తన పిల్లల్ని ఏ ఉదయమైనా నిర్భయంగా బయటికి పంపగలిగేంతైనా శాంతిని నెలకొల్పేవరకు ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ముగించదు. -
పి.కరుణాకరన్ (సీపీఎం)
రాయని డైరీ రోజూ లేచి లోక్‌సభకు వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. లేవడం, వెళ్లడం.. కష్టం కాదు. సభ లోపల ఉండడం కష్టంగా ఉంటోంది. కారిడార్‌లో నిన్న ఎవరో సడన్‌గా ఆపి అడిగారు – ‘మీరేమిటీ ఇలా ఉన్నారూ?’ అని! ‘‘నేను ఇలా ఉండడం ఏంటి?! నేను ఎలా ఉంటానని మీరు అనుకున్నారు? నేను ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?’’ అని అడిగాను. ‘‘మీరు కరుణాకరనే కదా?’’ అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడుతూ. ‘‘అవును నేను కరుణాకరన్నే’’ అన్నాను నేనూ ఆశ్చర్యపోతూ. ‘‘ఏం లేదు లెండి. మీరు నాకు తెలిసిన కరుణాకరనేమో అనుకున్నాను’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. ‘‘హలో.. హలో.. మీకు తెలిసిన కరుణాకరన్‌ది కూడా లోక్సభేనా? రాజ్యసభకు వెళ్లబోయి ఏదో ఆలోచిస్తూ ఇటు గానీ వచ్చేశారా!’’ అని వెనక్కు పిలిచి అడిగాను. ‘‘అయితే రాజ్యసభలో కూడా ఇంకో కరుణాకరన్ ఉన్నారా?’’ అని మళ్లీ ఎగ్జయిట్ అయ్యాడు ఆ వ్యక్తి. ‘‘ఉన్నాడో లేదో నాకూ తెలీదు. ఒకవేళ ఉండి ఉంటే, మీకు తెలిసిన కరుణాకరన్ అతడే అయ్యుండొచ్చు కదా..’’ అన్నాను. నిరాశగా చూశాడు. ‘‘అయితే మీరు కాదన్న మాట’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. నేను కాకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు! సభ లోపలికి వెళ్దామంటే భయమేసింది. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు.. మెజారిటీ వ్యక్తులు! ధైర్యం చేసి వెళ్లాను. లోపల సుమిత్రా మహాజన్ మా వాళ్లను కోప్పడుతున్నారు. ‘‘ఇది కురుక్షేత్రం కాదు.. కర్మక్షేత్రం. వెళ్లి కూర్చోండి’’ అంటున్నారు. బీజేపీలో ఒక్కరూ భారతీయ భాషల్లో మాట్లాడ్డం లేదు. అంతా భారతంలోని క్యారెక్టర్స్‌లా ఉన్నారు. ఇంటికి వచ్చాక సి.ఎం.కి ఫోన్ చేశాను. ‘‘నా వల్ల కావట్లేదు కామ్రేడ్.. అది లోక్‌సభలా లేదు. మహాభారత్ టీవీ సీరియల్లా ఉంది’’ అన్నాను. ‘‘ఇప్పుడా సీరియల్ రావట్లేదు కదా’’ అన్నారు కామ్రేడ్ పినరయి విజయన్. ‘‘పాత క్యాసెట్లు దొరుకుతాయి కామ్రేడ్. అది కాదు సమస్య’’ అన్నాను. ఆయన నవ్వారు. లేక నవ్వినట్లు నాకు అనిపించిందో! ‘‘ఫ్లోర్ లీడర్‌వి.. నువ్వే అలా అంటే ఎలా కరుణా..’’ అన్నారు ఆపేక్షగా. ‘‘ఫ్లోర్ బయట ఉన్నారు. మీకేం తెలుస్తుంది కామ్రేడ్’’ అన్నాను నేను. పెద్దగా నవ్వారు పినరయి విజయన్. ‘‘ఫ్లోర్ బయట ఉన్నవాళ్లనైనా ఈ బీజేపీ వాళ్లు సుఖంగా ఉండనిస్తారని ఎందుకు అనుకుంటున్నావు కరుణాకరన్’’ అన్నారు. ఆయన కష్టం నాకు అర్థమైంది! అరుణ్‌జైట్లీ అదివారం ఉదయాన్నే కేరళలో ఫ్లైట్ దిగుతున్నారు. మాధవ్ శింగరాజు