డిజిటల్‌ తరానికి సురక్షిత ఏఐ ఎలా? | Sakshi Guest Column On Artificial Intelligence | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ తరానికి సురక్షిత ఏఐ ఎలా?

Nov 10 2026 12:31 AM | Updated on Nov 10 2026 12:31 AM

Sakshi Guest Column On Artificial Intelligence

తరతరాలుగా విద్యాభ్యాసం అనేది విద్యార్థులు అడిగే ప్రశ్నలు, వాటికి లభించే వివరణలు, స్వతంత్రంగా ఆలో చించి కొత్త విషయాలను అన్వేషించ గలమనే వారిలోని ఆత్మవిశ్వాసం ఆధా రంగా రూపుదిద్దుకుంటూ వస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు ఈ మూడింటిలోనూ మార్పులు తీసుకొస్తోంది. సైన్స్‌ లోని ఒక అంశం అర్థం కాక ఇబ్బంది పడుతున్న టీనేజర్‌... దాని గురించి మరో విధంగా వివరించమని అడగవచ్చు. తనకు అనువైన వేగంతో ప్రాక్టీస్‌ ప్రశ్నలను సాధన చేయవచ్చు. 

ఎప్పటి నుంచో ఆసక్తి కలిగిస్తున్న ఒక విషయాన్ని మరింత లోతుగా అన్వేషించవచ్చు. ఈ మార్పు ఇప్పటికే మొద లైంది. యువత నేర్చుకోవడం, పునశ్చరణ చేసుకోవడం, సృజ నాత్మకంగా ఆలోచించడం, కొత్త నైపుణ్యాలను అలవరచుకోవ డంలో ఏఐ అంతర్భాగంగా మారుతోంది. 

భారత్‌వంటి విస్తారమైన, వైవిధ్యభరితమైన దేశానికి ఇది అపారమైన అవకాశాలను అందిస్తోంది. నాణ్యమైన ఉపాధ్యా యులు, మెరుగైన విద్యా సామగ్రి, భాషాపరమైన సహకారం, వ్యక్తిగత శ్రద్ధ అందరికీ సమానంగా అందుబాటులో లేవు. ఈ అంత రాలను కొంతమేర తగ్గించడంలో ఏఐ తోడ్పడగలదు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, మరింత సులభంగా అందుబాటులో ఉండేలా, ఆసక్తికరమైన రీతిలో విద్యాభ్యాసాన్ని మార్చగలదు.

అయితే, ఈ అవకాశంతోపాటు ఒక కీలకమైన బాధ్యత కూడా మన ముందుకొస్తోంది. ఏఐని యువతకు సురక్షితమైన సాధనంగా ఎలా మార్చాలి? వారికి హాని కలిగించే లేదా వారి వయసుకు తగని సమాచారానికి దూరంగా ఎలా ఉంచాలి? ఏఐపై అనారోగ్యకరమైన రీతిలో ఆధారపడకుండా ఎలా చూడాలి?

అందువల్ల టీనేజర్ల భద్రత అంటే హానికరమైన సమాచారాన్ని నిరోధించడానికే పరిమితం కాకూడదు. ఏఐని సురక్షితంగా, విమర్శ నాత్మక దృక్పథంతో, స్వతంత్రంగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని యువతలో పెంపొందించడం కూడా అందులో భాగం కావాలి.

భారతీయులకు అనుగుణంగా భద్రతా చర్యలు
భారత్‌లో చాలామంది టీనేజర్లకు సొంతంగా ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు ఉండవు. కుటుంబ సభ్యులంతా ఒకే ఫోన్‌ను లేదా కంప్యూటర్‌ను పంచుకుని ఉపయోగించడం సాధారణం. బాలికలకు ఈ పరికరాల వినియోగం మరింత పరిమితంగా ఉండవచ్చు. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒక ఖాతా తెరిచే టప్పుడు నమోదు చేసిన వయసు, వాస్తవంగా ఆ ఖాతాను ఉపయోగిస్తున్న వ్యక్తి వయసుతో సరిపోలకపోవచ్చు.

 ఇలాంటి పరిస్థితుల్లో వయసును అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానం అదనపు భద్రతా పొరగా పనిచేయగలదు. చాట్‌జీపీటీ కూడా వినియోగ దారుల ప్రవర్తన, ఖాతాకు సంబంధించిన ఇతర సంకేతాల ఆధారంగా 18 ఏళ్లలోపు వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. తద్వారా వారికి అదనపు భద్రతా పరిమితులు, రక్షణ చర్యలు ఆటోమేటిక్‌గా అమలవుతాయి.

టీనేజర్ల భద్రత విషయంలో భాష, సాంకేతికతను సులభంగా అందిపుచ్చుకునే అవకాశం కూడా కీలకమైన అంశాలే. యువతతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తమకు సుపరిచితమైన భాషల్లో, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఏఐ సాధనాలను ఉపయోగించుకోగలగాలి. వాయిస్‌ సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు హిందీ, ఇతర భారతీయ భాషల్లో సేవ లను విస్తరించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల కుటుంబాలు ఏఐతో మరింత సులభంగా మమేకం కావడమే
కాకుండా, దాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది.

టీనేజర్ల భద్రత ఉమ్మడి బాధ్యత
టీనేజర్ల భద్రతకు సంబంధించిన సమస్యలను ఏఐ సంస్థలు ఒక్కటే పరిష్కరించలేవు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, విశ్వసనీయమైన పెద్దలు కూడా కీలక పాత్ర పోషించాలి. ఏఐ ఇచ్చే సమాధానాలు తప్పు కావచ్చని అర్థం చేసుకోవడం, దాని వినియోగంలో అనారోగ్యకరమైన ధోరణులను గుర్తించడం, అవసర మైనప్పుడు దానికి దూరంగా ఉండటం వంటి విషయాల్లో టీనేజ ర్లకు అవగాహన కల్పించాలి. తద్వారా సాంకేతికతను తమకు అనుకూలంగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని వారిలో పెంపొందించాలి.

అయితే, టీనేజర్లకు మార్గనిర్దేశం చేయాల్సిన పెద్దలు కూడా ఏఐని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో ఇంకా నేర్చుకుంటున్నవారే. అందువల్ల టీనేజర్ల భద్రత అనేది కేవలం ఒక ఉత్పత్తికి సంబంధించిన అంశం కాదు. అది సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత. ఏఐ ఉత్పత్తులను మెరుగైన రీతిలో రూపొందించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చు. టీనేజర్ల స్వతంత్రతకు భంగం కలగకుండా, వారు ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంపై కుటుంబాలకు మరింత పర్యవేక్షణాధికారాన్ని కల్పించవచ్చు.

సామర్థ్యం పెంచడమే భద్రత
యువతను ఎలాంటి పనులు చేయడానికి ఏఐ ప్రోత్సహిస్తోందన్నది కూడా భద్రతలో భాగమే. అది వారిలో విచక్షణ, జిజ్ఞాస, స్వతంత్ర ఆలోచనా శక్తిని పెంపొందిస్తోందా? ఉదాహరణకు, ఒక విద్యార్థి గణిత సమస్యకు సమాధానం అడిగితే, ఏఐ నేరుగా జవాబు చెప్పవచ్చు. లేదా ఆ సమస్యను విద్యార్థి స్వయంగా పరిష్కరించు కునేలా దశలవారీగా మార్గనిర్దేశం చేయవచ్చు.

చిన్న వయసు వినియోగదారుల విషయంలో రెండో విధానా నికే ప్రాధాన్యమివ్వాలి. మెరుగైన ప్రశ్నలు అడగడం, సమస్యలను స్వయంగా సాధించడానికి ప్రయత్నించడం, చివరకు తమంతట తామే సమాధానాలను కనుగొనడం వంటివాటికి ఏఐ ప్రోత్సాహ మివ్వాలి. ఈ సూత్రాలు ఏఐ ఉత్పత్తుల పనితీరులోనూ ప్రతిబింబించాలి. ఉదాహరణకు, టీనేజర్లు ఏఐని ఎలా ఉపయోగించాలన్నది నిర్దేశించేందుకు తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు.

 ఇందులో చదువుకునే సమయాలను నిర్దేశించే సెట్టింగ్స్‌ కూడా ఉండవచ్చు. అలాంటి సమయాల్లో ఏఐ నేరుగా సమాధానాలు ఇవ్వకుండా, సమస్యలను ఒక్కో దశలో ఎలా పరిష్కరించాలో టీనేజర్లకు మార్గనిర్దేశం చేసేలా పనిచేయవచ్చు. యువత కోసం ఏఐని స్వీకరించి ఉపయోగించుకోవడమే కాకుండా, టీనేజర్లకు బాధ్యతాయుతమైన ఏఐ ఎలా ఉండాలన్న దానిని నిర్దేశించడంలోనూ భారత్‌కు ఒక గొప్ప అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా, అనేక భాషలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విషయంలో భిన్నమైన పరిస్థితులు ఉన్న దేశంగా భారత్‌ అనుభవం ప్రపంచవ్యాప్తంగా యువత కోసం ఏఐని ఎలా రూపొందించాలన్న విషయంలో విలువైన పాఠాలను అందించగలదు. ఏఐ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తున్న కొద్దీ, విభిన్న సామాజిక పరిస్థితులు, వాస్తవాలకు అనుగుణంగా దాని భద్రతా చర్యలు కూడా అంతే సమర్థంగా ఉండేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు.
మన పిల్లలు నేర్చుకోవడం, ఎదగడంలో ఏఐ కూడా ఒక భాగం కాబోతున్నట్లయితే, వారిని సురక్షితంగా ఉంచే చర్యలు కూడా ఏఐ అభివృద్ధితోపాటే మరింత బలోపేతం కావాలి.

వ్యాసకర్త స్ట్రాటెజీ అండ్‌ గ్లోబల్‌ ఎఫైర్స్‌ హెడ్, ఓపెన్‌ ఏఐ ఇండియా

ప్రజ్ఞా మిశ్రా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement