శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది? | Many questions raised by the Srikakula tribal movement remain unresolved | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

Nov 7 2026 3:35 AM | Updated on Nov 7 2026 3:36 AM

Many questions raised by the Srikakula tribal movement remain unresolved

శ్రీకాకుళ గిరిజన ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు రెండు ధోరణులు కనిపిస్తాయి. ఒకటి, దానిని పూర్తిగా వీరగాథగా చిత్రీకరించడం. రెండవది, దానిని విఫలమైన సాయుధ ఉద్యమంగా కొట్టిపారేయడం. ఈ రెండు దృక్కోణాలూ అసంపూర్ణ మైనవే. చరిత్రకు న్యాయం చేయాలంటే భావోద్వేగాల కంటే వాస్తవాల ఆధారంగా ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. ఇటీవల ‘సెంటర్‌ ఫర్‌ ఇండిపెండెంట్‌ రీసెర్చర్స్‌’ బృందం పిరిడి, గుమ్మ, కారివలస, చినమేరంగి, బొడ్డపాడు, గరుడభద్ర,జింకిభద్ర, మదనాపురం వంటి గ్రామాలను సందర్శించి ఆనాటి ఉద్యమకారులతో, వారి కుటుంబ సభ్యులతో, స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు ఒక విషయం స్పష్టమైంది.ఉద్యమ స్మృతులుఇంకా ప్రజలలో బలంగానే ఉన్నాయి. కానీ ఉద్యమం లేవనెత్తిన చాలా ప్రశ్నలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

యాభై ఏళ్ల ఉద్యమ విజయం
శ్రీకాకుళం గిరిజన ఉద్యమం కేవలం ఒక సాయుధ పోరాటం మాత్రమే కాదు; అది భూమి, గౌరవం, జీవన హక్కుల కోసం అణగారిన ప్రజలు చేసిన చారిత్రక ప్రతిఘటన. 1960 దశకంలో శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొన్న పరిస్థితులు తీవ్రమైనవి. భూములపై హక్కుల్లేకపోవడం, అప్పుల బానిసత్వం, అటవీశాఖ అధికారుల దౌర్జన్యం, భూస్వాముల పెత్తనం, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి.

అందువల్ల శ్రీకాకుళం ఉద్యమాన్ని కేవలం నక్సలైట్‌ ఉద్యమంగా నిర్వచించడం చారిత్రక పొరపాటు. అది ముందుగా ఒక సామాజిక తిరుగుబాటు. తరువాతే సాయుధ పోరాటంగా రూపాంతరం చెందింది. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భారత ప్రజా స్వామ్యం గిరిజన సమాజాన్ని అభివృద్ధి ప్రవాహంలో చేర్చలేక పోయింది. భూసంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో చూస్తే ఉద్యమానికి ప్రధాన బాధ్యత ఉద్యమకారులపై కాదు; ముందుగా రాష్ట్రంపై పడుతుంది. ఉద్యమం భూమిని స్వాధీనం చేసుకుందా? అధికారాన్ని స్వాధీనం చేసుకుందా? లేదు. దాని అతిపెద్ద విజయం ఏమిటంటే, గిరిజనులను చరిత్రలో కనిపించేలా చేసింది. అప్పటివరకు గిరిజనులు ప్రభుత్వ నివేదికలలోని గణాంకాలు మాత్రమే. ఉద్యమం వారిని రాజకీయ శక్తిగా, సామా జిక వాస్తవికతగా దేశం ముందు నిలబెట్టింది.

ఎక్కడ విఫలమైంది?
చరిత్రను విమర్శనాత్మకంగా చదవాలంటే విజయాలతో పాటు తప్పులను కూడా గుర్తించాలి. ఉద్యమం ప్రారంభ దశలో ప్రజా మోదం బలంగా ఉన్నప్పటికీ, తర్వాతి దశలో సాయుధ చర్యలు ప్రధానంగా మారాయి. దీంతో ప్రజల భాగస్వామ్యం క్రమంగా తగ్గి, ఉద్యమం కొద్దిమంది కార్యకర్తల చుట్టూ కేంద్రీకృతమైంది. రాష్ట్ర యంత్రాంగం ఎంత బలంగా స్పందిస్తుందో ఉద్యమ నాయకత్వం పూర్తిగా అంచనా వేయలేకపోయింది. తీవ్ర నిర్బంధం, ఎన్‌కౌంటర్లు, అరెస్టులు ఉద్యమాన్ని బలహీనపరిచాయి. పోరాటం తర్వాత గిరిజనుల కోసం సుస్థిర రాజకీయ, ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని సృష్టించడంలో ఉద్యమం పరిమితంగానే నిలిచింది. విద్య,ఆరోగ్యం, సాగునీరు, ఉపాధి వంటి అంశాలతో పోరాటాన్నిమరింత అనుసంధానించి ఉంటే ఉద్యమానికి విస్తృత మద్దతులభించే అవకాశం ఉండేది. కాని అలా జరగలేదు.

ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న చక్రధర్‌ 85 ఏళ్ళ వయస్సులో ఎంతో ఉత్సాహంగా ఆనాటి ఉద్యమ జ్ణాపకాలను నెమరు వేసుకున్నారు. పార్టీ నాయకులు చెప్పినట్టు నడిచాం; ప్రాణాలొడ్డి పోరాటం చేశాం; ఆ ఫలితమే ఈ గ్రామాలకు గుర్తింపు; ఈ రోజు మేం ఇలా ఈ మారుమూల గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్నామంటే ఆ పోరాట ఫలితమే అన్నారు.

ఉద్యమ కాలంలో బొడ్డపాడు గ్రామం ఉద్యమానికి గుండె కాయ లాంటిది. ఈ గ్రామం నుంచి సుమారు 11 మంది అమరు లయ్యారు. ప్రతీవారీంట్లోనూ లెనిన్, మావో చిత్రపటాలు కనిపించాయి. మా సమస్యలకు పరిష్కారం కనిపించడం లేదు; మేము కూడా పూర్వంలాగే ఉద్యమాల బాటపడితేగాని ప్రభుత్వం గుర్తించ దేమో అని గ్రామస్థులు అన్నారు. ఆ గ్రామ సర్పంచ్‌ తూమాడ మదన్, ఉద్యమంలో అసువులు బాసిన తూమాడ గణపతి కుమా రుడు. జీడి పిక్కలకు కిట్టుబాటు ధర ఇవ్వడంలేదు; కనీసం మా శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదంటూ వాపోయారు. 

భూమి, విద్య, ఆరోగ్యం, ఉపాధి సమస్యలు పరిష్కారం కాకపోతే సంఘర్షణలు పుడతాయని ఈ ఉద్యమం మనకు గుర్తు చేస్తుంది. సాయుధ పోరాటం సమస్యను ప్రపంచానికి చూపించగలదు. కానీ శాశ్వత పరిష్కారాలకు ప్రజాస్వామ్య, రాజకీయ, సామాజిక ప్రక్రియలు అవసరమవుతాయి.

ప్రజాస్వామ్యంతోనే శాశ్వత మార్పు
ఈ ఉద్యమంపై సుమారు రెండు దశాబ్దాలపాటు అధ్యయనం చేసి ‘శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం: పరిశోధన – విశ్లేషణ’ పుస్తకాన్ని రాసిన ఎస్‌.ఎ. విద్యాసాగర్‌– వ్యవసాయిక విప్లవానికి ప్రధాన పోరాట కేంద్రం మైదాన ప్రాంతాలనీ, ఆక్రమంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో అంటే అడవి, కొండ ప్రాంతాల్లో రక్షణ తీసుకోవాలనీ సిద్ధాంతీకరించారు. ఆచరణలో అర్ధ ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాలకు కేంద్ర బిందువుగా అడవి, కొండ ప్రాంతాలు మారిపోయాయి. నిజానికి వీళ్ళ ఉద్యమంపై (శ్రీకాకుళంనిమినహాయిస్తే) మైదాన ప్రాంతాల్లో ఆనాటికి పాలక వర్గాల రక్షణ బలగాల సంఘటిత హంతక దాడులు సాగలేదు. కానీ వ్యూహాత్మకప్రాంతంగా ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలను ఎంచుకొని ఉద్యమాల సృష్టికి బయలుదేరారు.

మౌలికంగా శ్రీకాకుళం ఓటమికి తక్షణ కారణంగా చారు మజుందార్‌ అవలంబించిన అతివాదమే కారణం అని చెప్పితప్పించుకోవచ్చు. కానీ వ్యవసాయక విప్లవం ప్రాతిపదికన ప్రపంచంలో ఎక్కడా విప్లవాలు విజయవంతం కాలేదు. భారతీయ కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి మాత్రం దున్నేవానికే భూమి ప్రాతిపదికన సాగిన వ్యవసాయ విప్లవం అనేది తారక మంత్రంలా తయారయింది. స్వాతంత్రం వచ్చింది మొదలూ కొద్ది ప్రాంతాలలోరైతాంగ ఆదివాసుల్లో సాగించిన కృషి పెట్టుబడిదారీ సంబంధాలను పాదుకొల్పడానికీ, విస్తృతి కావడానికీ మాత్రమే తోడ్పడింది. ఆ అనవసర యుద్ధంలో అత్యంత వెనుకబడిన శక్తుల చేతుల్లో ఆయు ధాలు పెట్టి వాళ్ళను బలికోరడం 20, 21 శతాబ్ధాలలో కూడా కొన సాగడం దురదృష్టకరమని మాత్రం చెప్పవచ్చు అని విద్యాసాగర్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

శ్రీకాకుళోద్యమాన్ని వీరుల కథగా మార్చితే దాని అసలు పాఠాలు కనిపించవు. విఫలయత్నంగా కొట్టేస్తే చరిత్రకు అన్యాయం చేసినట్లే. సామాజిక న్యాయం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ప్రజల భాగస్వామ్యం లేకుండా విప్లవం సాధ్యం కాదు. ప్రజాస్వా మ్యాన్ని విస్మరించి శాశ్వత మార్పు సాధ్యం కాదు. 

విద్య, ఆరోగ్యం, సాగునీరు, ఉపాధి వంటి అంశాలతో పోరాటాన్ని మరింత అనుసంధానించి ఉంటే ఉద్యమానికి విస్తృత మద్దతు లభించే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు.

– కె.ఎస్‌.ఎస్‌. బాపూజీ ‘ సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement