వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు | Rebellions are caused by systemic crises | Sakshi
Sakshi News home page

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

Rebellions are caused by systemic crises

2010 నాటి అరబ్‌ స్ప్రింగ్‌తో మొద లైన యువతరం తిరుగుబాట్ల దశ 2026 వచ్చేసరికి ప్రపంచవ్యాప్తమైంది. ఒక లెక్క ప్రకారం గత ఏడాది కాలంలో ఆసియా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలు, యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికాలు కలిపి 73 జరిగాయి. ప్రస్తుత సూచనలను బట్టి ఈ సంవత్స రాంతానికి మరికొన్ని జరగనున్నాయి. ఇదంతా ఉదారవాద ప్రజాస్వామ్యం పేరిట సాగుతున్న పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాల సంక్షో భమేనా?

మునుపెన్నడూ లేదు!
యువతరం తిరుగుబాట్లు గతంలోనూ జరిగాయి. ముఖ్యంగా 1960ల చివరలో. కానీ ఇంత విస్తృతంగా, ఈ పద్ధతిలో ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఎందుకట్లా అన్నది ప్రశ్న. వందలసంవత్సరాల యూరోపియన్‌ సామ్రాజ్యవాదాలు, వలస పాలనల దశలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కరీబియన్‌ దీవులలో తలెత్తిన స్వాతంత్య్ర పోరాటాలు, సాయుధ తిరుగుబాట్లు అసంఖ్యాకం. ప్రత్యక్ష వలస పాలనలు ముగిసిన తర్వాత దశలో పాశ్చా త్యుల నయా వలస వ్యవస్థలకు, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికమైన తిరుగుబాట్లు, కమ్యూనిస్టు తిరుగుబాట్లు అనేకా నేకం జరిగాయి. ఆ వెనుక మూడవ దశ అన్నది ఆర్థికమైన, అంత ర్జాతీయమైన సంస్థల ఏర్పాటు, ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్యాలు, గతంలో ప్రత్యర్థులుగా ఉండిన శక్తుల మధ్య సయోధ్యలు, ఈ మార్పులను నిర్దేశించే అంతస్సూత్రంగా ఉదారవాద ప్రజాస్వామ్యం అన్నట్లుగా రూపు తీసుకోసాగింది.

ఇందుకు మినహాయింపులు లేవని కాదు. పలు దేశాలలో సైనిక నియంతృత్వాలు, ఎన్నికైన నియంతృత్వాలు, రాచరికాలు, అరబ్‌ రాజ్యాల వంటి షేక్‌ కుటుంబ పాలనల సంఖ్య తక్కువేమీ కాదు. అయినప్పటికీ మొత్తం ప్రపంచ చిత్రాన్ని గమనించినప్పుడు ఉదార వాద ప్రజాస్వామ్యంతో పాటు పెట్టుబడిదారీ అన్నది ప్రధాన లక్ష ణంగా మారింది. ఇందులో ఉదారవాద ప్రజాస్వామ్యం కాదు గానీ పెట్టుబడిదారీ అభివృద్ధి ధోరణి మాజీ కమ్యూనిస్టు దేశాలకు కూడా వ్యాపించింది. కాకపోతే తగు స్థాయిలో సమానావకాశాలు కల్పిస్తూ.

ప్రపంచమంతటా అదే రీతి
సూత్ర రీత్యా ఇది ఒక దశ అని భావిస్తే, అది సవ్యంగా అమలై స్థిరపడి కొనసాగితే ఎట్లుండేదో గానీ, అధికారంలో ఉండేవారు చెప్పింది చేయరు, లేదా అరకొరగా మాత్రమే చేసి తమ ప్రయోజ నాలపై దృష్టి పెడతారు గనుక, పరిస్థితులు వికటించటం మొదలైంది. దానితో రకరకాల కారణాల వల్ల అసంతృప్తి చెందిన యువ తరం, సాధారణ ప్రజలు తిరుగుబాట్లు చేసే దశ 1960ల చివరిలో మొదలైంది. ఫ్రాన్స్, పాకిస్తాన్, అమెరికా, మెక్సికో, థాయ్‌లాండ్, పశ్చిమ జర్మనీ, సోవియెట్‌ రిపబ్లిక్‌లలో అది కనిపించింది. భారత దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ, 1971లో శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) తిరుగుబాటు, 1989లో చైనాలోని తియాన్‌ ఆన్‌మన్‌ వంటివన్నీ ఈ వరుసలోకి వచ్చేవే.

అయితే, ఉదారవాద ప్రజాస్వామ్యం, అందరికీ సమానావ కాశాలు కల్పించే అభివృద్ధి లేదా ప్రపంచబ్యాంకు వారు ఆర్థిక సంస్కరణలలో భాగంగా చెప్పిన పెర్కొలేషన్‌ థియరీ వంటివన్నీ పైన చెప్పిన పరిణామాల నుంచి నేర్చుకున్నది స్వల్పమని మరొక రెండు దశాబ్దాలు గడిచే సరికి అర్థం కాసాగింది. ఆ విధంగా యువ తరం తిరుగుబాట్ల మరో దశకు అరబ్‌ స్ప్రింగ్‌తో ఆరంభం జరిగింది. ట్యునీషియా, ఈజిప్టు, లిబియా, యెమెన్, సిరియా, బెహ్ర యిన్‌ వరుసగా అల్లకల్లోలమయాయి. అభివృద్ధి లేమి, పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజాస్వామ్యం లేకపోవడం, దశా బ్దాలుగా నియంతలుగా పాలించే కుటుంబాలు, నాయకులుఇందుకు కారణమై, ప్రపంచ యువతరం తిరుగుబాట్లలో మరొక అధ్యాయానికి తెరతీశారు.

ఎక్కడి కారణాలు అక్కడ
అప్పటినుంచి మొదలైన ప్రస్తుత దశ నేటికీ కొనసాగుతున్నది. ఇందుకు దోహదం చేస్తున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. పైన చెప్పుకున్నట్లు ఈ సంవత్సర కాలంలోనే 73 దేశాలలో ఈ ఘటనలు జరిగాయనుకుంటే, అందుకు కారణాలు ఎక్కడికక్కడ ప్రత్యేకమై నవి కొన్నున్నాయి. అన్ని దేశాల యువతకు, ప్రజలకు, లేదా కొన్నింటికి కలిపి వర్తించేవి కొన్నున్నాయి. వాటిలో ఆర్థికాభివృద్ధి, పేదరికం, అవకాశాల కల్పన, ప్రజాస్వామ్యం, అణచివేతలు, అవినీతి, బంధుప్రీతి, విద్యావైద్యాలు, ఇళ్ల కొరతలు, నిరవధికమైన కుటుంబ పాలనలు, మతతత్వాలు, పాశ్చాత్య సామ్రాజ్యవాదాల పట్ల విధేయ తలు, దేశ స్వతంత్ర విధానాలకు భంగకరమైన విధానాలు, నియంతృత్వాలు, ఎన్నికైన నియంతృత్వాలు, ఎన్నికల అక్రమాలు, వాగ్దాన భంగాలు, క్రోనీ క్యాపిటలిజం, దేశ వనరులను దోచి పెట్టటం వంటి అనేకానేకం కనిపిస్తున్నాయి. ఈసారి కొత్తగా కనిపిస్తున్నవి టీనేజర్లు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటుండటం, మొత్తం అందరికీ కలుగుతున్న ఏఐ భయాలు.

ఈ సంవత్సరం ఇప్పటికే అన్ని ఖండాలలో కలిపి 73 దేశాలలో తలెత్తిన ఈ పరిస్థితులు మరిన్ని దేశాలకు విస్తరించే సూచనలున్నా యంటే, మౌలికంగానే ఎక్కడనో తీవ్ర వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయన్నమాట. ఆ వైఫల్యాలు ఏమిటో కొత్తగా కనుగొనవలసిన అవసరం లేదు. వలసవాదం నుంచి మొదలుకొని ప్రస్తుతం ఉదార వాద ప్రజాస్వామ్యం అనే వరకు ఎప్పుడైనా జరుగుతూ వస్తున్నది ఒక్కటే. 

ఏ దేశానికి అక్కడ పరిమితమైగానీ, అంతర్జాతీయంగాగానీ ఆధిపత్య వర్గాల స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాయి. ఆర్థికంగానైనా, రాజకీయంగానైనా, పరిపాలనాపరంగానైనా అందు కోసం యువతను, ప్రజలను మోసగిస్తున్నాయి, అణచివేస్తున్నాయి. కొన్ని పైపై మెరుగులు తప్పితే ఇందులో ఎటువంటి మార్పు మౌలి కంగా ఉండటం లేదు. అందుకే ఈ విడతలో లెఫ్ట్, రైట్, సెంటర్‌ తేడా లేకుండా అందరూ ఉద్యమిస్తున్నారు. అలజడులు, ఉద్య మాలు, తిరుగుబాట్లు దశలు దశలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలు, ఉదారవాద ప్రజాస్వామ్యాల అభివృద్ధి నమూనాలే ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ పరిస్థితులను అర్థం చేసుకోవటంలో జరుగుతున్న ఒక పొరపాటు గురించి చెప్పుకోవాలి. ఉదాహరణకు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భారతదేశ ఉద్యమాలను ఒకటే తరహాలోకి తెచ్చి వ్యాఖ్యానిస్తున్నారు పలువురు. పైన వివరించుకున్న దాని ప్రకారం మౌలిక కారణాలు ప్రపంచవ్యాప్తంగా స్థూలంగా ఒకే విధంగా ఉండ వచ్చు. కానీ, వివరాలలోకి వెళ్లినపుడు ఆ ఉద్యమాల తీరులో వ్యత్యా సాలు కనిపిస్తాయి. అది తెలియకుండా ఈ ఉపఖండపు నాలుగు ఉద్యమాలను అనుకూలమైన రీతిలో పోల్చటంగానీ, ప్రతికూల వైఖరితో అంచనా వేసి ఖండించటంగానీ పొరపాటు అవుతుంది.

ఈ సంవత్సరం ఇప్పటికే అన్ని ఖండాలలో కలిపి 73 దేశాలలో తలెత్తిన ఈ పరిస్థితులు మరిన్ని దేశాలకు విస్త రించే సూచనలున్నాయంటే, మౌలికంగానే ఎక్కడనో తీవ్ర వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయన్నమాట.


-వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు
- టంకశాల అశోక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement