న్యూఢిల్లీ: చైనా, రష్యాలతోపాటు భారత్‌లోనూ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వడగాడ్పుల ప్రభావం చాలా తీవ్రంగా ఉండనున్నట్లు అంతర్జాతీయ పరిశోధన సంస్థ లాన్సెట్ కౌంట్‌డౌన్ పదో సూచిక నివేదిక తెలిపింది. అటు వృద్ధులతోపాటు, పసిపిల్లలపై కూడా వడగాడ్పుల ప్రభావం చాలా తీవ్రంగా ఉండనున్నట్లు హెచ్చరించింది. 2024లో రికార్డు స్థాయిలో వడగాడ్పులు వచ్చాయని, ఫలితంగా ఆ ఏడాది వృద్ధులు దాదాపు 1530 కోట్ల దినాలను కోల్పోగా పసిపిల్లలు 230 కోట్ల రోజులు కోల్పోయారని ఈ నివేదిక తెలిపింది.
ఒక వ్యక్తి సంవత్సరంలో పది రోజులపాటు వడగాడ్పుల ప్రభావానికి లోనైతే అన్ని దినాలను కోల్పోయినట్టుగా లెక్కకట్టారు. 2025లో ఈ సంఖ్య వృద్ధులకు 1080 దినాలు, శిశువులకు 110 కోట్ల దినాలుగా ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభా ఆధారంగా లెక్కకట్టినప్పుడు వృద్ధులు 2025లో సగటున ఏడాది 12.8 రోజులు వడగాడ్పుల సమస్యలు ఎదుర్కొన్నారు. శిశువుల విషయానికి వస్తే ఈ సంఖ్య 8.7 రోజులుగా ఉంది. యూకేలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు ఈ నివేదికను సిద్ధం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోందని, అదేసమయంలో ఇది భూతాపోన్నతికి తగ్గట్టుగా ఉండటం లేదని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం మునుపటి సంవత్సరాలతో పోలిస్తే 2016 నుంచి వేగం పుంజుకుందన్నారు.
భూతాపోన్నతిని 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని తీర్మానించిన ప్యారిస్ ఒప్పందం తరువాత దశాబ్ద కాలం గడచిపోయిందని, ఇప్పటికైనా వాతావరణ మార్పులను అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభంగా ప్రకటించాలని శాస్త్రవేత్తలు అభ్యర్థించారు. ఇలా చేస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా తగు చర్యలు తీసుకునేందుకు వీలేర్పడుతుందని వాదించారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణానికి సంబంధించి నిర్ణయాలను తీసుకుంటారని తెలిపారు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తక్షణమే, న్యాయబద్ధంగా తగ్గించడం; శాస్త్రీయ పరిశోధనలకు పెట్టుబడులు ఎక్కువ చేయడం, ఆరోగ్యం కోసం వాతావరణ నిధులను రుణాల రూపంలో కాకుండా గ్రాంట్ల రూపంలో అందించడం వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దీని వల్ల దేశాలు అదనపు రుణభారం మోయకుండా అనుకూల చర్యలు తీసుకోగలుగుతాయని వారు వివరించారు.
హానీ పెరిగిపోతోంది...
‘‘పారిస్ ఒప్పందం కుదిరి దశాబ్దం గడిచింది. ఈ సమయంలో ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యానికి జరుగుతున్న హాని పెరిగిపోతూండగా ప్రపంచం స్పంద అంతే స్థాయిలో పెరగడం లేదు’’అని లాన్సెట్ కౌంట్‌డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యూనివర్శిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ మరీనా రొమానెల్లో అన్నారు. ఇంధనం, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత, ఆరోగ్యాన్ని పరిరక్షణల విషయాల్లో పురోగతి సాధించినా ఇది చాలా నెమ్మదిగా ఉందని పేర్కొన్నారు. అవసరమైన వారికి చేరడం లేదని తెలిపారు. 2016–2025 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్న 2023లో వల్ల సుమారు 7.10 లక్షల మంది అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రాణాలు కోల్పోయారని, ఇది మలేరియా లేదా ఎయిడ్స్ వంటి వ్యాధులతో జరిగిన మరణాల కంటే ఎక్కువని నివేదిక తెలిపింది. 2016 నుంచి 2023 మధ్య కాలంలో వేడి సంబంధిత కారణాలతో దాదాపు 30 లక్షల మంది మరణించినట్లు నివేదిక అంచనా వేసింది.
ఇదీ చదవండి: దేశ వ్యతిరేకులన్న వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా?


