వన్డే సమరానికి 'సై' | First ODI match between India and New Zealand today | Sakshi
Sakshi News home page

వన్డే సమరానికి 'సై'

Nov 4 2026 4:20 AM | Updated on Nov 4 2026 4:22 AM

First ODI match between India and New Zealand today

భారత్, న్యూజిలాండ్‌ మధ్య నేడు తొలి మ్యాచ్‌

బరిలో కోహ్లి, రోహిత్‌ 

శుభారంభంపై కివీస్‌ దృష్టి

ఉదయం గం.7:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్,సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఏడాది తర్వాత జరిగే వన్డే వరల్డ్‌ కప్‌కు అసలైన సన్నద్ధత న్యూజిలాండ్‌ గడ్డపై మొదలు కానుంది. దాదాపు దక్షిణాఫ్రికాను పోలి ఉండే పరిస్థితుల మధ్య వన్డే పోరుకు భారత్‌ సిద్ధం కాగా... స్వదేశంలో బలమైన ప్రత్యర్థితో తలపడి తమ స్థాయిని పరీక్షించుకోవాలని కివీస్‌ భావిస్తోంది. హోరాహోరీగా సాగిన ఐదు టి20ల తర్వాత ఇప్పుడు వన్డేల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి. ఇరు జట్ల మధ్య ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను కివీస్‌ సొంతం చేసుకోవడం గమనార్హం.

ఆక్లాండ్‌: కెప్టెన్‌ గిల్‌ వచ్చేశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా ఆటకు సిద్ధమయ్యారు. టి20ల్లో ఆకట్టుకున్న పలువురు ప్లేయర్లు ఇప్పుడు మరో ఫార్మాట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య నేడు జరిగే తొలి మ్యాచ్‌తో పోరుకు తెర లేవనుంది. ఇరు జట్లు తమ ఆఖరి వన్డే సిరీస్‌లో ఇటీవలే సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డేల్లో తలపడి సిరీస్‌ విజయాలు అందుకున్నాయి. ఇరు జట్ల బలబలాలను చూస్తే వన్డే సిరీస్‌ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. 

సిరాజ్‌పై బౌలింగ్‌ భారం... 
టి20 సిరీస్‌లో ఆడిన కనీసం ఐదుగురు ఆటగాళ్లకు వన్డేల్లో కూడా తుది జట్టులో ఖాయం. శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు నమన్‌ ధీర్, అక్షర్‌ పటేల్, అర్‌‡్షదీప్, నితీశ్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. అయ్యర్‌కు నాలుగో స్థానంలో ఇది సరైన ఫార్మాట్‌ కాగా, నమన్‌ ఇటీవలి ప్రదర్శనతో తన విలువను చూపించాడు. నాలుగేళ్ల కెరీర్‌లో 18 వన్డేలే ఆడిన అర్ష్ దీప్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇది సరైన అవకాశం. హార్దిక్‌ పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో వరుసగా చాన్స్‌లు దక్కించుకుంటున్న ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ రెడ్డి నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది.

బ్యాటింగ్‌లో సహజంగానే ప్రధాన ఆకర్షణ కోహ్లి, రోహిత్‌లే. వీరిద్దరు తమ రెగ్యులర్‌ స్థానాల్లో సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు. కివీస్‌ గడ్డపై 14 వన్డేలు ఆడినా ఒక్క సెంచరీ కూడా లేని రోహిత్‌ తన చివరి పర్యటనలో ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తున్నాడు. కెప్టెన్‌ గిల్‌ ఈ ఏడాది ఏకంగా 895 పరుగులు చేసి వన్డేల్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్‌లో రాహుల్‌ బాధ్యత తీసుకుంటాడు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు విశ్రాంతి కొనసాగించడంతో పేస్‌ భారం సీనియర్‌ అయిన సిరాజ్‌పైనే ఉంది. మూడో పేసర్‌ గుర్నూర్‌ 9 వన్డేలే ఆడగా, కంబోజ్, నబీలకు ఒక్కో మ్యాచ్‌ అనుభవమే ఉంది!

కాన్వే దూరం... 
వన్డేల్లో గత కొంత కాలంగా కివీస్‌ నిలకడగా ఆడుతోంది. టి20లతో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా వన్డేల్లో కూడా దాదాపు అదే జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్‌ యంగ్‌ మాత్రమే ఈ ఫార్మాట్‌లో స్పెషలిస్ట్‌ ఆటగాడు. సిరీస్‌కు ముందు గాయాలతో చాప్‌మన్, రచిన్‌ రవీంద్ర దూరం కావడం జట్టును బలహీనపర్చింది. మరోవైపు కాన్వే అనూహ్యంగా ప్రాక్టీస్‌లో ‘కన్‌కషన్‌’కు గురై ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకోవడం కూడా ఓపెనింగ్‌కు సమస్యగా మారింది. మిచెల్‌కు భారత్‌పై అసాధారణ రికార్డు ఉండగా... ఫిలిప్స్, బ్రేస్‌వెల్‌తో పాటు టి20ల్లో లేని లాథమ్‌ మిడిలార్డర్‌ బాధ్యతలు తీసుకుంటారు. కెప్టెన్‌ సాంట్నర్‌ ఎప్పటిలాగే నమ్మకమైన ఆల్‌రౌండర్‌. ఆ జట్టు పేస్‌ బృందంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. స్మిత్, జేమీసన్, హెన్రీ, డఫీలు ఆడటం దాదాపు ఖాయమే.

14 న్యూజిలాండ్‌ గడ్డపై న్యూజిలాండ్‌తో భారత్‌ ఇప్పటి వరకు 45 వన్డేలు ఆడింది. ఇందులో 14 విజయాలు సాధించింది. 26 పరాజయాలు మూటగట్టుకుంది. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌. నేరుగా ఉండే బౌండరీలు చాలా చిన్నవి. శుక్రవారం ఇక్కడ జరిగిన నాలుగో టి20లో కివీస్‌ ఏకంగా 259 పరుగులు చేసింది. అయితే ఈ ఫార్మాట్‌లో మాత్రం ఏకపక్షంగా కాకుండా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా సహకరించే మెరుగైన పిచ్‌ను సిద్ధం చేశారు. చక్కటి బౌన్స్‌ కూడా ఉండటంతో పేసర్లు ప్రభావం చూపించవచ్చు. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement