తొలి రోజు భారత షూటర్ల ఖాతాలో మూడు పతకాలు
దోహా: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కకపోయినా... ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత షూటర్లు మూడు పతకాలు సాధించారు. నాన్ ఒలింపిక్ ఈవెంట్ అయిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో సౌరభ్, రవీందర్ సింగ్, అమన్‌ప్రీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1659 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో రవీందర్ రజత పతకం గెల్చుకున్నాడు. 41 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రవీందర్ 559 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. సౌరభ్ 551 పాయింట్లతో 11వ స్థానంలో, అమన్‌ప్రీత్ 549 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచారు. క్వాలిఫయింగ్‌లో సాధించిన పాయింట్ల ఆధారంగానే టీమ్ విభాగం పతకాలను ఖరారు చేశారు.
ఇలవేనిల్‌కు ఆరో స్థానం
ఒలింపిక్ ఈవెంట్ అయిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇలవేనిల్ వలారివన్ (634.2 పాయింట్లు), సోనమ్ మస్కర్ (630.5 పాయింట్లు), శాంభవి క్షీరసాగర్ (629.7 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు 1894.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆమె పతకం నెగ్గడంలో విఫలమైంది.
ఎలిమినేషన్ పద్ధతిలో ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఇలవేనిల్ 167.3 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. టాప్–3లో నిలిచిన షూటర్లకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు పార్థ్ మానే 630.3 పాయింట్లతో 16వ స్థానంలో... హిమాన్షు ధిల్లాన్ 628.1 పాయింట్లతో 41వ స్థానంలో... పార్థ్ మఖిజా 625.2 పాయింట్లతో 61వ స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.


