ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై చర్చ
షూటింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌లో తక్కువ పతకాలు రావడంపై దృష్టి
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత ప్రదర్శనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించనుంది. ఈ నెల 13న జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లతో మంత్రిత్వ శాఖ భేటీ కానుంది. ఈ సమావేశంలో అథ్లెటిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్‌లో భారత ప్లేయర్లు ఆశించిన స్థాయిలో పతకాలు సాధించకపోవడంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. 2023లో చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత బృందం 106 పతకాలు సాధించగా... తాజా జపాన్ ఆసియా క్రీడల్లో 85 పతకాలకే పరిమితమైంది.
ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం క్రీడలపై భారీగా ఖర్చు పెడుతున్నా... కొన్ని క్రీడాంశాల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదనే ఆందోళనల నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ‘టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్’ (టాప్స్) ద్వారా నిధుల విడుదల అంశాన్ని కూడా సమీక్షించనున్నారు. ‘అక్టోబర్ 13న జరగనున్న సమావేశంలో అన్నీ జాతీయ క్రీడా సమాఖ్యలు పాల్గొంటాయి. రోజంతా జరిగే కార్యక్రమంలో అన్నీ విషయాలపై చర్చ జరుగుతుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
కొంతమంది అనుభవజ్ఞులైన ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంపై మంత్రిత్వ శాఖ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. టాప్స్ పథకం ద్వారా మద్దతు పొందుతున్న అథ్లెట్లలో పలువురి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండటంపై కూడా చర్చ జరిగే అవకాశలున్నాయి. తొమ్మిది క్రీడాంశాల్లో 34 మంది అగ్రశ్రేణి అథ్లెట్లపై రూ. 27 కోట్లు ఖర్చు చేసినా వారిలో ఒక్కరు కూడా పతకం సాధించలేకపోవడం విస్మయానికి గురిచేస్తోందని క్రీడా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కేవలం ఒక్క పతకమే రాగా... మన షూటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత షూటర్‌గా రికార్డు నెలకొల్పిన మనూ భాకర్ కూడా ఏషియన్ గేమ్స్‌లో పతకం లేకుండానే వెనుదిరిగింది. 2023 ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించిన భారత్ ఈసారి కేవలం ఒక్క పసిడి పతకానికే పరిమితమైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఈ సారి తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి బాటపట్టింది.
ఇక క్రీడలకు ముందు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ అనూహ్యంగా గాయాల బారినపడ్డారు. ఇలాంటి అన్నీ అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. తాజా ఆసియా క్రీడల్లో పాల్గొన్న 501 మంది భారత అథ్లెట్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 700 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆ స్థాయిలో పతకాలు రాకపోవడంతో క్రీడా శాఖ సమస్య మూలాలను గుర్తించే పనిలో పడింది.


