మొత్తం 114 పతకాలతో ముగించిన భారత బృందం
గత క్రీడలతో పోలిస్తే 6 పతకాలు అదనం
శుక్రవారం మన ఖాతాలో మరో 25 పతకాలు
నేటితో పారా ఆసియా క్రీడలకు తెర
నగోయా: పారా ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలకు మించి రాణించింది. ఐదో రోజు కూడా మన ఖాతాలో 25 పతకాలు చేరగా, వీటిలో 9 స్వర్ణాలు ఉండటం విశేషం. దాంతో మన ఆటగాళ్లు సాధించిన మొత్తం పతకాల సంఖ్య సెంచరీ దాటింది. 2023 ఆసియా క్రీడల్లో మొత్తం 108 పతకాలు సాధించి ఆరో స్థానంతో ముగించిన భారత్ తమ పోటీల చివరి రోజు శుక్రవారం ఆ సంఖ్యను అధిగమించింది. గత క్రీడలతో పోలిస్తే ఈసారి సంఖ్యాపరంగా దాదాపు సగం మందే భారత్ నుంచి బరిలోకి దిగినా... అదనంగా మరో 6 పతకాలు జోడించి మొత్తం 114 పతకాలు గెలుచు కోవడం మన సత్తాను చాటింది. ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా... ఆఖరి రోజు శనివారం తర్వాత మన స్థానం ఏమిటో ఖరారవుతుంది.
‘నవ’ స్వర్ణధారులు
ఆర్చరీ రికర్వ్ పురుషుల డబుల్స్‌లో భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. హర్వీందర్ సింగ్–విజయ్ సుంది జోడీ ఫైనల్లో 5–1తో చైనా ద్వయం డ్యూ యున్–లిక్స్ జావోను చిత్తు చేసింది. షూటింగ్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1లో మోనా అగర్వాల్ (357.5 పాయింట్లు) స్వర్ణం గెలిచింది. బ్యాడ్మింటన్‌లో మనకు 3 స్వర్ణాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో నితేశ్ కుమార్ పసిడి గెలిచాడు.
ఫైనల్లో అతను 21–18, 21–16తో భారత్‌కే చెందిన ప్రమోద్ భగత్‌పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో నవీన్ శివకుమార్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఫైనల్లో అతను 21–9, 21–17తో ఫ్రెడీ సెటియవన్ (ఇండోనేసియా)ను ఓడించాడు. మహిళల డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌యు5 విభాగంలో మానసి జోషి–తులసిమతి మురుగేశన్ జోడి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో మానసి –తులసిమతి 21–16, 21–13తో గ్జియా యంగ్–గ్జియాన్ జియోవా (చైనా)పై గెలుపొందింది.
రెండు ప్రపంచ రికార్డులు
అథ్లెటిక్స్‌లో భారత్ శుక్రవారం మరో 4 స్వర్ణాలను గెలుచుకుంది. పురుషుల 400 మీటర్ల టి64లో సందీప్ 52.28 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం నెగ్గాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మాకు (32.87 మీటర్లు) స్వర్ణం లభించింది. పురుషుల జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పసిడి పతకాలు దక్కాయి. ఎఫ్42–ఎఫ్44/ఎఫ్61–ఎఫ్64 ఈవెంట్‌లోసుమీత్ అంటిల్ (72.46 మీటర్లు) స్వర్ణం... జావెలిన్ త్రో ఎఫ్37/38లో హానీ (60.49 మీటర్లు) ప్రపంచ రికార్డుతో పసిడి పతకం అందుకున్నాడు.
ఐదో రోజు భారత రజత పతక విజేతలు (8)
ఆర్చరీ: రికర్వ్ మహిళల డబుల్స్ (భావన–పూజ); బ్యాడ్మింటన్: ప్రమోద్ భగత్ (పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3), తులసిమతి (మహిళల సింగిల్స్ ఎస్‌యు5), నిత్యశ్రీ (మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6), నితేశ్–తులసిమతి (మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌యు5); అథ్లెటిక్స్: మహేంద్ర గుర్జర్ (పురుషుల ఎఫ్42–ఎఫ్44/ఎఫ్61–ఎఫ్64), పర్‌మోద్ (పురుషుల 1500 మీటర్లు. టి46), నిమిష (మహిళల లాంగ్‌జంప్ టి47);
భారత కాంస్య పతక విజేతలు (8): అథ్లెటిక్స్: సందీప్ (పురుషుల 100 మీ. టి44), అజయ్ (పురుషుల 400 మీ. టి64), రాకేశ్ భట్ (పురుషుల 200 మీ. టి37), నవదీప్ (పురుషుల జావెలిన్ త్రో ఎఫ్40/ఎఫ్41), సందీప్ (పురుషుల జావెలిన్ త్రో ఎఫ్42–ఎఫ్44/ఎఫ్61–ఎఫ్64), ధరమ్‌వీర్ (పురుషుల క్లబ్ త్రో ఎఫ్51); స్విమ్మింగ్: హిమాన్షు (పురుషుల 100 మీ. ఫ్రీ స్టయిల్ ఎఫ్11); టేబుల్ టెన్నిస్: శుభమ్–జేహన్ (పురుషుల డబుల్స్–క్లాస్ ఎండీ4).


