డకర్ (సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. మన యువ క్రీడాకారిణులు జూడోలో రజతం, స్విమ్మింగ్‌లో కాంస్యం సొంతం చేసుకున్నారు. మహిళల జూడో 63 కేజీల విభాగంలో 15 ఏళ్ల ఖుష్బూ రజక్‌భాయ్ రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఆమె జొలినా రీన్‌హోల్డ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. యూత్ ఒలింపిక్స్ పతకం గెలిచిన రెండో భారత జూడోకాగా ఖుష్బూ గుర్తింపు పొందింది.
గతంలో భారత్ నుంచి తంగ్‌జామ్ తబాబీ దేవి మాత్రమే పతకం (రజతం; 2018లో) సాధించింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల ధీనిధి కాంస్య పతకం గెలుచుకుంది. ఫైనల్ రేస్‌ను ధీనిధి 56.27 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. అనా బబనొవిక్ (క్రొయేషియా; 55.89 సెకన్లు), అలీసా లాసన్ (న్యూజిలాండ్; 56.13 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో 15 నుంచి 18 ఏళ్లలోపు క్రీడాకారులు పోటీపడుతున్నారు.


