మహిళల టి20ల్లో ప్రేమ రావత్ ప్రపంచ రికార్డు
పుణే: ఉత్తరాఖండ్ బ్యాటర్ ప్రేమ రావత్ మహిళల టి20ల్లో కొత్త ఘనతను నమోదు చేసింది. కేవలం 14 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ సాధించింది. బీసీసీఐ మహిళల దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రేమ 14 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
గతంలో పాక్ క్రికెటర్ ఫాతిమా సనా 15 బంతుల్లో చేసిన అర్ధ సెంచరీ రికార్డును ప్రేమ బద్దలుకొట్టింది. మరో భారత క్రికెటర్ రాఘ్వీ బిష్త్ (50 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఉత్తరాఖండ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 98 పరుగులకే పరిమితమై 89 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.


