న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ అనుసరించిన వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత.. చివరి రెండు టీ20లలో బెంచ్‌పై ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందని అంతా భావించారు. అయితే మేనేజ్‌మెంట్ పెద్దగా మార్పులు చేయకపోవడం గమనార్హం.
ఈ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, ఆకిబ్ నబీ, కుమార్ కుషాగ్ర వంటి టాలెంటెడ్ ప్లేయర్లకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను సిరీస్ మొత్తానికి పక్కన పెట్టడంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆసియా గేమ్స్ ఫైనల్, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన దూబేను ఇలా పక్కన పెట్టడం సరికాదని అతడు అభిప్రాయపడ్డారు.
కివీస్ సిరీస్‌లో దూబే స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. అటు బ్యాట్‌తో, ఇటు బంతితోనూ పర్వాలేదనిపించాడు.
"శివమ్ దూబే ఆసియా గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ రాణించాడు. అలాంటి ఆటగాడు జట్టులో కచ్చితంగా ఉండాలి. బౌలింగ్ పరంగా దూబే కంటే నితీష్ కుమార్ రెడ్డి మెరుగైన బౌలర్ కావచ్చు.
కానీ, మ్యాచ్‌లను ముగించడంలో (ఫినిషర్‌గా) మాత్రం శివమ్ దూబేయే అత్యుత్తమం. ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్స్, ఆసియా కప్ వంటి మెగా టోర్నీల్లో దూబే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. త్వరలోనే అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవ్‌న్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను" అని 'క్రిక్‌ఇన్ఫో' ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా పేర్కొన్నారు.
చదవండి: SA vs BAN: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డేంజరస్ బ్యాటర్ రీఎంట్రీ


