టీమిండియా (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ముగించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన ఐదో టీ20లో ఆతిథ్య కివీస్.. శ్రేయస్ సేనపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-3తో భారత్‌కు కోల్పోయినప్పటికీ ఆధిక్యాన్ని మాత్రం తగ్గించగలిగింది.
పూర్తిగా విఫలం
ఇక ఈ సిరీస్ ద్వారా నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన భువనేశ్వర్ కుమార్ పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి 11.25 ఎకానమీ రేటుతో ఏకంగా 180 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో భువీ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. టీమిండియా యాజమాన్యం తీరుపై మండిపడ్డాడు. భువీని ఈ సిరీస్‌లో ఆడించి తప్పుచేశారని.. అతడికి బదులు యువ పేసర్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
అతడిని ఆడించి తప్పు చేశారు
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. సెలక్టర్లు భువనేశ్వర్ కుమార్‌ను ఈ సిరీస్‌లో ఆడించి పెద్ద తప్పే చేశారు. భువీ మంచి బౌలర్.. సీనియర్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు.
అయితే, టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే అతడిని ఆడించాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీలో ఆడించాలని భావిస్తే.. అందుకు తగ్గట్లుగానే అతడిని సిద్ధం చేయాల్సింది.
యువ బౌలర్లకు అన్యాయం
కివీస్‌తో సిరీస్‌లో భువీని ఆడించడం ద్వారా యువ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అవకాశాలు రాకుండా పోయాయి. భువీ లేకుంటే మయాంక్ యాదవ్ ఐదు టీ20లలోనూ ఆడేవాడు. ప్రిన్స్ యాదవ్‌కు కూడా వరుస మ్యాచ్‌లలో అవకాశాలు వచ్చేవి. న్యూజిలాండ్ గడ్డ మీద యువ పేసర్లకు అనుభవం గడించే అవకాశాన్ని మీరు ఇవ్వలేదు.
అతడి నైపుణ్యాలపై సందేహాలు లేవు.. కానీ
భువనేశ్వర్ ఈ సిరీస్‌లో విఫలమయ్యాడు కాబట్టి నేను ఈ మాటలు అనడం లేదు. తొలి రెండు ఓవర్లు మంచిగానే వేసినా.. పవర్ ప్లేలో అతడు భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఇలాంటి వైఫల్యాలు సహజమే. అతడి నైపుణ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.
కానీ సరైన సమయంలో భువీని జట్టులో ఆడించలేదు. 36 ఏళ్ల ఈ పేసర్‌కు బదులు మరో యువ ఫాస్ట్ బౌలర్‌ను ఆడించాల్సింది. కఠినమైన పిచ్‌లపై ఆడిస్తేనే యువ బౌలర్లకు అనుభవం వస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా నాయకత్వ బృందం తీరును తూర్పారబట్టాడు.
ఇవీ చదవండి: ఐదేసిన ముకేశ్.. సిరాజ్‌కు నాలుగు వికెట్లు; కివీస్ 424 ఆలౌట్
అతడి ఖేల్ ఖతం.. వన్డే జట్టులోకి తిరిగి రాలేడు: మాజీ క్రికెటర్


