దేశ వ్యతిరేకులన్న వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా? | Rahul Gandhi challenges PM Modi to head-to-head debate | Sakshi
Sakshi News home page

దేశ వ్యతిరేకులన్న వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా?

Nov 4 2026 4:31 AM | Updated on Nov 4 2026 4:31 AM

Rahul Gandhi challenges PM Modi to head-to-head debate

ప్రధానికి రాహుల్‌ సవాల్‌ 

ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు రెడీ అన్న ప్రతిపక్ష నేత 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పైనా చర్చిద్దామని పిలుపు

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలను దేశ వ్యతిరేకులంటూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సవాలు విసిరారు. విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయన్న తన ఆరోపణలపై మోదీ ఇప్పటివరకూ పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. విదేశీ శక్తుల సాయంతో ప్రతిపక్షాలు దేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపించడం.. బదులుగా రాహుల్‌ విదేశీ శక్తుల సాయంతోనే మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్నారని ప్రత్యారోపణ చేయడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాహుల్‌ మంగళవారం ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... ‘‘మోదీగారు.. నేను సవాలు విసిరి 24 గంటలవుతోంది. ప్రతిపక్షం యాంటీ నేషనల్‌ అంటున్నారు మీరు. ఏ వేదికనైనా ఎంచుకోండి. ఎక్కడైనా సరే. ఈ విషయంపై నాతో చర్చించండి. ఎవరు యాంటీ నేషనల్‌? విదేశీ శక్తులతో సంబంధాలున్నవారా? ఈ సంబంధాల తీరుతెన్నులేమిటి? వీలైనంత తొందరలో ఈ చర్చ చేద్దాం. ఏం భయపడవద్దు’’అని వ్యాఖ్యానించారు. ‘‘మన ఇద్దరితోపాటు మీడియా కూడా ఉంటుంది. దేశ యువత కూడా హాజరవుతుంది. ఒక బల్ల ఉంటుంది. మీరు అటు.. నేను ఇటు కూర్చుందాం. మీరు ఎవరినైనా జడ్జిగా నియమించుకోండి. మోహన్‌ భాగవత్‌ గారినైనా న్యాయమూర్తిగా పెట్టుకోవచ్చు’’అని బహిరంగ చర్చకు సంబంధించిన వివరాలిచ్చారు రాహుల్‌.

ఈ చర్చలో ఆర్థిక వ్యవస్థలపై, నిర్మాణంపై ప్రశ్నలుంటాయి. ‘‘అమెరికాతో ఒప్పందం ఎలా కుదిరింది? ఎందుకు కుదిరింది? ఎందుకు అంత తొందరగా జరిగింది? కేబినెట్‌కు కూడా చెప్పకుండా ఎందుకు మీరొక్కరే ఒప్పందం చేసుకున్నారు? అదానీ కేసు ఎందుకు మూతపడింది? ఎప్‌స్టీన్‌ వంటి అంశాలు బోలెడు ఉంటాయి’’అని అన్నారు. అన్నింటి గురించి బహిరంగంగానే మాట్లాడుకుందామని, నిజాలు బయటకు రావాలని అన్నీ తేటతెల్లం కావాలని అన్నారు. ‘‘మీరు నాపై ఆరోపణలు చేశారు. చేశారు కదా? ముందుకు రండి... అన్నీ స్పష్టమవుతాయి’’అని సవాలు విసిరారు.

‘‘నాపై ఇతర అంశాలకు సంబంధించి చాలా పరువునష్టం కేసులు వేశారు. నాకు తెలిసి 45 పరువునష్టం కేసులున్నాయి. కానీ ఈ చర్చకు సంబంధించి, విదేశీ సంబంధాల గురించి నాపై పరువు నష్టం కేసు వేయలేదు. వేయండి. ఆ విషయం కూడా ఓపెన్‌గా చర్చిద్దాం. దీపావళి శుభాకాంక్షలు మోదీ గారు’’అంటూ తన పోస్టులో వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని చర్చకు ఆహ్వానించడం ‘‘మతోన్మాద ఇస్లామిస్టులు సెక్యులరిజమ్‌ గురించి మాట్లాడినట్లే ఉంది’’అని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం వ్యాఖ్యానించారు. ఉన్నతస్థాయి చర్చలు ఇద్దరు పరిపక్వత ఉన్న వ్యక్తుల మధ్య జరుగుతాయని ఆయన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement