సందర్భం
లాల్ కృష్ణ అడ్వాణీ... భారత రాజకీయ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు. నేడు ఆయన శతాయుష్కుల జాబితా లోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఆయన నూరవ పుట్టిన రోజు, దీపావళి పండుగతో జమిలిగా రావడం విశేషం. ఆధునిక భారత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలతో పెన వేసుకున్న సుదీర్ఘ జీవితం ఆయనది. 1927 నవంబరు 8న ‘దేవ్ దీపావళి’ పర్వదినాన జన్మించారు. 1947లో తరుణ ప్రాయంలోనే సింధు ప్రాంతంలోని తన చిరపరిచిత ప్రపంచాన్ని వీడి రావాల్సిన దుఃస్థితిని, వేదనను అనుభవించారు. అయిన ప్పటికీ, చేదు అనుభవాలకు తావులేకుండా శూన్యం నుంచితన జీవిత పునరుద్దీపన చేసుకున్నారు.
కఠిన పరిస్థితుల్లోనూ ఆద్యంతం పునర్నిర్మించగల ఈ లక్షణం, సామర్థ్యం ఆయన సహజాతాలు. జనసంఘ్‌ను బలోపేతం చేసే వేళ, భారతీయ జనతా పార్టీకి రూపురేఖలు దిద్దే సమయాన ఆయనలోని ఈ లక్షణాలే కీలక పాత్ర పోషించాయి. ఆయన 1989లో పార్టీ అధ్య క్షుడిగా ‘బీజేపీ’కి సారథ్యం వహించినపుడు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 400 నుంచి 200 స్థానాల దిగువకు పతనమైంది. 1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ‘దేశమే ప్రధానం’ సూత్ర ప్రాతిపదికన పార్టీకి బలమైన పునాది వేశారు.
విశిష్ట లక్షణాలు
ఒక నాయకుడిగా అడ్వాణీ విశిష్టతను తెలిపే రెండు ప్రత్యేక లక్షణాలను మనమిప్పుడు గుర్తుచేసుకోవాలి. మొదటిది... ఆయనకుగల సైద్ధాంతిక స్పష్టత–మేధాపరమైన పదును. ఇది ఆయన రచనల్లో, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తూంటుంది. ఆయన రూపొందించిన జనసంఘ్, బీజేపీ తీర్మానాలు నేటికీ అధ్యయనార్హమైనవే. ఆయన ఇంటర్వ్యూలు లోతుగా, సూటిగా ఉండేవి. రెండోది... భారత రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగిన ‘మిథ్యా లౌకికవాదాన్ని’ ఎండగట్టడంలో ఆయన చాతుర్యం.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఆయన తొలుత రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడి నుంచి దేశ రాజధానికి వచ్చి, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే అయినా, దశాబ్దాల పాటు పరస్పర పోటీదారులుగా మారకపోవడం స్ఫూర్తిదాయకం. ఈ ఇరువురూ భారత రాజకీయాల దశ–దిశలను మార్చివేశారు.
అడ్వాణీ తన జన్మస్థలం వీడి ఢిల్లీ చేరేనాటికి దేశ విభజన పర్యవసాన ఘోరాల నుంచి నగరం అప్పుడప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసంఘ్ బలోపేతం లక్ష్యంగా తన వంతు కృషిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్ అయ్యారు.ఆయన పార్లమెంటరీ ప్రస్థానం 1970లో ప్రారంభమైంది. ఎంపీగా, ఆ తర్వాత ఉభయ సభలలో ప్రతిపక్ష నేతగానేకాకుండా అధికార పక్షంలోనూ తనదైన ముద్ర వేశారు. 1991 లోక్‌సభ ఎన్నికలు నాకింకా గుర్తు.
అడ్వాణీ రెండు స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒకటి గాంధీనగర్. గుజరాత్‌తో ఆయనకు అప్పటికే అనుబంధం ఉంది. దేశ విభజన తర్వాత ఆయన తండ్రి కచ్‌లో స్థిరపడ్డారు. అడ్వాణీ గుజరాత్ నుంచి రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి, గాంధీ నగర్‌లో పోటీ అంటే– ఒకరకంగా సొంత గూటికి తిరిగి రావడం లాంటిది. బీజేపీ సంస్థలో భాగస్వామిని కాబట్టి, ఆయన సమ ర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేయడం సహా ప్రచారంలోనూ సహాయపడే గౌరవం నాకు దక్కింది. ఆ తర్వాత కూడా అక్కడి ఓటరుగా అనేకసార్లు ఆయనకు ఓటు వేసే గౌరవం లభించింది.
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో...
ఆయన జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు. ప్రజా స్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ పోరాటాన్ని ఆయనముందుండి నడిపించారు. నాటి అనుభవాలను ‘ఎ ప్రిజనర్స్ స్క్రాప్–బుక్’ పుస్తకంలో పంచుకున్నారు. అందులోని ‘ఎ టేల్ ఆఫ్ టూ ఎమర్జెన్సీస్’ అనే ఒక భాగం 1975 జూన్‌లో భారత్‌లోసంభవించిన పరిణామాలతో... 1933 నాటి నాజీ జర్మనీలోసంఘటనలకు గల అద్భుత సారూప్యాన్ని కళ్లకు కడుతుంది.
అడ్వాణీ చిచ్చరపిడుగు వంటి ప్రతిపక్ష నేత. అంతేకాదు అద్భుత పరిపాలకుడు కూడా. జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయన సమాచార–ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. అటుపైన ఉప ప్రధానమంత్రిగా, దేశంలో అత్యధిక కాలం హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన నేతగా దేశ భద్రత వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న నిర్ద్వంద్వ వైఖరి వల్లనే భారత్ అత్యంత పటిష్ట ఉగ్రవాద నిరోధక చట్టం చేయగలిగింది.
రథయాత్ర
అడ్వాణీ జీవితంలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర నిస్సందేహంగా ఒక చారిత్రక ఘట్టం. ఈ యాత్రపై సమాలోచన దశ నుంచి పూర్తిస్థాయి అమలు దాకా నాకూ భాగం దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. యాత్ర ప్రారంభమైన ప్పుడు నేను కూడా సోమనాథ్‌లో ఉండటం ప్రత్యేక అనుభవా న్నిచ్చింది. బిహార్‌లో ఆయన అరెస్టు నాటి బాధాకర జ్ఞాపకాలు కూడా నా మదిలో ఇంకా మెదలుతున్నాయి. ఆ తర్వాత గుజ రాత్‌లో చిమన్‌భాయి పటేల్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది. సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఏదేమైనప్పటికీ రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రమాణం చేశారు. ఎట్టకేలకు అనేక ఏళ్ల తర్వాత దేశ ప్రజల ఆశీస్సులతో అయోధ్యలో శ్రీరామ ప్రభువుకు దివ్య–భవ్యమందిరం రూపుదిద్దుకుంది. అడ్వాణీలో ప్రశంసించదగిన గుణాలెన్నో ఉన్నాయి.
ఇందుకు తొలి ఉదాహరణ... ఆయన నిరాడంబరత్వం. నవ నిర్మాణ ఉద్యమం తర్వాత ఆయన జునాగఢ్‌కు వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరస్కారం ఎదురైన అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ, సాధారణ కార్యకర్తలా నెల రోజులు మెలిగారు. పరిచయస్తులందరూ ఆయనను పుస్తకాల పురుగుగా అభివర్ణి స్తారు. ఆయనతో సమయం గడిపేవారికి వార్తాపత్రికలను ఎంత జాగ్రత్తగా చదువుతారో బాగా తెలుసు. సినిమా, నాటకాలకు అభిమానిగానే కాకుండా ఉత్సాహభరిత సినీ విమర్శకుడిగానూ ఆయన ప్రసిద్ధులు. ‘మై కంట్రీ– మై లైఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో అడ్వాణీలోని చారిత్రక స్పృహ, దాన్ని పరిరక్షించాలనే తపన ప్రస్ఫుటమవుతాయి. ఆయన సదా సింధీ సంస్కృతితో సంబంధాలు నెరపేవారు. లేహ్ సమీపంలోని సింధు దర్శన్ పూజను ప్రాచుర్యంలోకి తేవడం ఆయన కృషిలో మరొక భాగం. ఆయనతోనూ, జార్జి ఫెర్నాండెజ్‌తోనూ కలసి నేను స్వయంగా ఆ పూజలో పాల్గొన్నాను.
అడ్వాణీ సతీమణి కమలా అడ్వాణీ ప్రస్తావన లేకుండా ఆయన అద్భుత జీవన ప్రస్థానంపై వివరణ అసంపూర్ణమే! ఆయన ప్రజా జీవితమంతటా నిరంతర శక్తికి, మద్దతుకు ఆమె మూలస్తంభంగా నిలిచారు.ఓ బాలుడిగా కరాచీలో ఎదుగుతున్న రోజుల్లో తన జీవితం ఇన్నిన్ని మలుపులు తిరుగుతుందని అడ్వాణీ బహుశా ఊహించి ఉండరు. ఆయన సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా దేశ ప్రజానీకం 2024లో ఆయనను ‘భారతరత్న’ పురస్కారంతో సత్కరించారు. ప్రజాభిమానం చూరగొన్న అడ్వాణీ తన జీవితంలో వందోసంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయన ఆయు రారోగ్యాలతో వర్ధిల్లుతూ ఎప్పటిలాగానే మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
అడ్వాణీలో ప్రశంసించదగిన గుణాలెన్నో ఉన్నాయి. పరిచయస్తులందరూ ఆయనను పుస్తకాల పురుగుగా అభివర్ణిస్తారు. ఆయనతో సమయం గడిపేవారికి వార్తాపత్రికలను ఎంత జాగ్రత్తగా చదువుతారో బాగా తెలుసు. సినిమా, నాటకాలకు అభిమానిగానే కాకుండా ఉత్సాహభరిత సినీ విమర్శకుడిగానూ ఆయన ప్రసిద్ధులు. ‘మై కంట్రీ– మై లైఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో అడ్వాణీలోని చారిత్రక స్పృహ, దాన్ని పరిరక్షించాలనే తపన ప్రస్ఫుటమవుతాయి.
-నరేంద్ర మోదీ ,భారత ప్రధాని


