అభిప్రాయం
నేటి ప్రభుత్వాల పాలనలో రైతాంగం పండించే ఏ పంటకూ న్యాయమైన ధర లభించక రైతులు అప్పుల పాలై బలవన్మ రణాలకు పాల్పడుతున్నారు. ఇదే సమయంలో బడా వ్యాపారులు, పెద్ద పెద్ద రైస్ మిల్లర్లు లాభాలతో జేబులు నింపుకొంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బియ్యం ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఆకాశం వైపు పరిగెడుతున్నాయి. జూలై 2026 వరకు రిటైల్ మార్కెట్‌లో సోనా మసూరి కిలో 65 రూపాయలు ఉంటే, అక్టోబర్ నాటికి 85 నుండి 105 రూపాయలకు చేరింది.
బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు, సిండికేట్ వ్యాపారులే కారణం. సిండికేట్ వ్యాపార వర్గం మార్కెట్ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని, కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతోంది. ధాన్యం కొనుగోళ్ల నుండి బియ్యం అమ్మకం వరకు ప్రతి దశలోనూ ధరలను వీళ్లే నిర్ణయిస్తారు. రైతుల నుండి వినియోగదారులకు చేరేలోపు కనీసం 3 నుండి 4 దశల్లో సిండికేట్ సభ్యులు లాభాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల రైతులకు దక్కేది తక్కువ, వినియోగదారులు పెట్టే ధర ఎక్కువ అవుతున్నది.
సిండికేట్ల లాభాలు
బియ్యం మార్కెట్లో సిండికేట్ వ్యాపారుల లాభాలు సాధారణ వ్యాపార లాభాల కంటే 3 నుండి 4 రెట్లు అధికంగా ఉన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరకంటే 15 నుండి 20% తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. అదే సరుకును వినియోగదారులకు అమ్మేటప్పుడు మార్కెట్ ధర కంటే 30 నుండి 40% అదనపు ధరకు విక్రయించి రెండు విధాల భారీగా లాభాలు గడిస్తున్నారు. సాధారణ లేదా నాణ్యత లేని బియ్యాన్ని అత్యాధునిక మిల్లుల్లో పాలిష్ చేసి బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేసి, సూపర్ ఫైన్ రకం పేరుతో మార్కెట్లో అమ్మి 50% పైగా లాభాలు గడిస్తున్నారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కిలో 10 నుండి 15 రూపాయలకు కొనుగోలు చేసి, వాటిని పాలిష్ పట్టి బహిరంగ మార్కెట్లో 40 నుండి 50 రూపాయలకు అమ్ముతున్నారు.
ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, అధికార పార్టీ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయి మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారని ఆరోపణలున్నాయి. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపార సామ్రాజ్యాలు రాజకీయ పార్టీలకు భారీగా ఎన్నికల నిధులు సమకూరుస్తుంటాయి. అందుకు ప్రతి ఫలంగా తమ వ్యాపారాలపై ప్రభుత్వ నిఘా, తనిఖీలు పెద్దగా లేకుండా చేసుకుంటున్నారనే ఆరోపణలూ వచ్చాయి.
ఇదీ చదవండి: 'బెటర్ లేట్ దేన్ నెవర్.. అందుకే స్పందిస్తున్నా'
రైతుల పరిస్థితులను, కరువు ప్రభావాన్ని, ఏర్పడనున్న ఆహార ధాన్యాల కొరతను దృష్టిలో పెట్టుకుని కుంటిసాకులు మాని వరి సేద్యానికి అనుమతించాలనీ, బియ్యం తదితర ఆహార ధాన్యాల ధరల పెరుగుదలను, సిండికేట్ వ్యాపారుల మోసాలను అరికట్టాలనీ, దొంగ నిల్వలను బయటకు తీయాలనీ, బహిరంగ మార్కెట్లో మేలు రకం బియ్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే చౌక ధరకు విక్రయించాలనీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సమైక్యంగా ఉద్యమించాలి.
- బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ)


