ప్రపంచంలో ‘అన్నపూర్ణ’గా పేరుగాంచిన భారత్‌లో ఇప్పుడు బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. పొలంలో బంగారాన్ని పండించే సగటు రైతు పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా దాపురించింది. ఒకవైపు వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంటే, మరోవైపు అహోరాత్రులు శ్రమించే రైతుకు మాత్రం సరైన ధర దక్కడం లేదు. ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే సత్తా ఉన్న భారతదేశంలో ఈ విపరీతమైన వ్యత్యాసానికి కారణాలేమిటి? భవిష్యత్తులో రాబోయే ముప్పుల నుంచి గట్టెక్కేందుకు మార్గాలేమిటి? అనే ప్రశ్నలొస్తున్నాయి.
బియ్యం ధరల మంట
మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుంటే రైతులకు దక్కే ధరల విషయంలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతోంది. ధాన్యం క్వింటాలు మద్దతు ధర పెంపు అరకొరగానే ఉండగా, బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొందరు రిటైలర్లు కేజీ నాన్-బాస్మతి బియ్యం సుమారు రూ.80కి పైగా విక్రయిస్తున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు
‘రైతు ఏడ్చిన నేల, ఎద్దు ఏడ్చిన ఎవుసం ముందుకు సాగవు’ అంటారు. పండించిన ధాన్యాన్ని రైతు విక్రయించగానే మధ్యవర్తులు, వర్తకులు వాటిని నిల్వ చేసి సరుకుకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో పాటు మిల్లింగ్, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వినియోగదారుడిపై అదనపు భారంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో దిగుబడులు తగ్గుతాయనే అంచనాలతో వ్యాపారులు ముందస్తుగా సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ఎల్‌నినో.. ఊహించని ఆహార సంక్షోభం!
ఒకవేళ ఎల్‌నినో ప్రభావం తీవ్రమైతే దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాన రాక.. ప్రాణం పోక అన్నట్లుగా పరిస్థితులు తయారవుతాయి. దిగుబడి పడిపోతే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తుంది. సామాన్యుడి కంచంలో అన్నం అరుదైపోతుంది. ఆకలి కేకలతో పాటు తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత ఏర్పడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది.
భవిష్యత్తు కార్యాచరణ: నివారణే మార్గం
ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం తక్షణమే సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలి. అక్రమ నిల్వలు చేసే దళారులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి వర్తకుడి వద్ద ఉన్న సరుకు వివరాలను డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా పర్యవేక్షించాలి. రైతే రాజు అనే మాట కేవలం నినాదానికే పరిమితం కాకుండా రైతులకు నేరుగా వినియోగదారులతో కనెక్టివిటీ ఇచ్చేందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పీఓ) బలోపేతం చేయాలి. ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే తక్కువ కాలపరిమితి, తక్కువ నీటితో పండే వరి రకాలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం వద్ద ఉన్న ఆహార నిల్వలను(బఫర్ స్టాక్) సమర్థవంతంగా నిర్వహించి ధరలు పెరిగినప్పుడు బహిరంగ మార్కెట్ పథకం ద్వారా తక్కువ ధరలకే సరుకును సరఫరా చేయాలి.
అన్నదాత సుఖీభవ అనేది కేవలం దీవెన మాత్రమే కాదు, అది దేశ సార్వభౌమాధికారానికి పునాది. మార్కెట్‌లో బియ్యం ధరల మంటను అదుపు చేస్తూనే చెమటోడ్చి పంట పండించే రైతుకు సరైన ప్రతిఫలం దక్కేలా చూడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. సమయానుకూల నిర్ణయాలు, కఠిన చర్యలతో మాత్రమే భారత్ తన ఆహార భద్రతను కాపాడుకుంటూ ప్రపంచానికి అన్నపూర్ణగా నిలవగలదు.
ఇదీ చదవండి: ‘రూపాయి పతనానికి ఇవే కారణం కాదు’


