రూ.74.19 కోట్లను తిరిగి ఎప్పుడు చెల్లిస్తారు? | Farmers question the Chandrababu government regarding the refund of premiums | Sakshi
Sakshi News home page

రూ.74.19 కోట్లను తిరిగి ఎప్పుడు చెల్లిస్తారు?

Nov 29 2026 3:39 AM | Updated on Nov 29 2026 3:39 AM

Farmers question the Chandrababu government regarding the refund of premiums

ప్రీమియం తిరిగి చెల్లింపులపై చంద్రబాబు సర్కార్‌కు రైతుల ప్రశ్న

బీమా కంపెనీల నుంచి ఆ  మొత్తాన్ని ఎప్పటికి రాబడతారు?

ప్రీమియం వసూళ్లపై చూపిన చొరవ తిరిగి చెల్లింపుల్లోనూ చూపాలి

సొమ్ము రాబట్టే గడువు, చెల్లింపుల తేదీపై స్పష్టత ఇవ్వాలి

ఈ–పంట డేటా సరిపోక పోవడంతో తిరిగి చెల్లించాల్సిన ప్రీమియంపై రైతాంగం డిమాండ్‌

ఉచిత పంటల బీమాను ఎత్తివేసినప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

సాక్షి, అమరావతి: పంటల బీమా పరిధిలోకి రాని రైతులకు వారి నుంచి వసూలు చేసిన ప్రీమియం సొమ్మును ఎప్పటిలోగా తిరిగి చెల్లిస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఈ–పంట డేటాతో పంటల బీమా దరఖాస్తుల వివరాలను అనుసంధానించి పరిశీలించగా, బీమా కోసం నమోదు చేసిన 42.75 లక్షల ఎకరాల్లో కేవలం 28.88 లక్షల ఎకరాల వివరాలే సరిపోలాయి. మిగిలిన 13.87 లక్షల ఎకరాలకు సంబంధించి బీమా వివరాలు సరిపోలకపోవడంతో వాలిడేషన్‌ అనంతరం రైతులకు దాదాపు రూ.74.19 కోట్ల ప్రీమియాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రైతుల నుంచి మొత్తం రూ.276.73 కోట్లను ప్రీమియం రూపంలో వసూలు చేసిన ప్రభుత్వం.. తిరిగి చెల్లించాల్సిన రూ.74.19 కోట్ల ప్రీమియంను బీమా కంపెనీల నుంచి రాబట్టి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతోంది.

 అయితే బీమా కంపెనీల నుంచి ఈ సొమ్మును ఎప్పటిలోగా వసూలు చేస్తారు? రైతులకు ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు? చెల్లింపులకు నిర్దిష్ట గడువు ఎందుకు ప్రకటించడం లేదు? అన్నదే ఇప్పుడు రైతుల ముందున్న ప్రధాన ప్రశ్న. ప్రీమియం వసూలు చేసేటప్పుడు లక్ష్యాలు నిర్దేశించి మరీ ఒత్తిడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రైతులకు వారి సొమ్మును తిరిగి ఇప్పించడంలోనూ అదే చొరవ చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేసినప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఏం జరిగింది?
» ఉచిత పంటల బీమాను ఎత్తివేసినప్పటి నుంచి ప్రీమియం భారం కావడంతో రైతులు పంటల బీమాకు దూరమైపోయారు.
» ఈ నేపథ్యంలో ఖరీఫ్‌–2026లో పంటల బీమా కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా ప్రీమియం వసూలు చేసింది.
» వర్షాభావం, భారీ వర్షాలు, వరుస తుపాన్‌లతో  తీవ్ర కష్ట నష్టాల్లో ఉన్న రైతులు.. ఆసక్తి చూపకపోయినా క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించి మరీ ప్రీమియం వసూలు చేయించింది.
» సాగు చేసిన రైతులతోపాటు సాగు చేయని రైతుల నుంచి కూడా ప్రీమియం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
» మొత్తం 16.57 లక్షల మంది రైతులు 42.75 లక్షల ఎకరాలకు బీమా చేయించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
» రైతుల నుంచి ప్రీమియం రూపంలో మొత్తం రూ.276.73 కోట్లు వసూలయ్యాయి.
» బీమా దరఖాస్తుల వివరాలను ఈ–పంట డేటాతో అనుసంధానించి పరిశీలించగా కేవలం 28.88 లక్షల ఎకరాల వివరాలే సరిపోయాయి.
» అంటే 13.87 లక్షల ఎకరాలకు సంబంధించిన బీమా వివరాలు ఈ–పంట నమోదుతో సరిపోలలేదు.
» ఈ వాలిడేషన్‌ ప్రక్రియ అనంతరం రైతులకు దాదాపు రూ.74.19 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
»ఈ మొత్తాన్ని బీమా కంపెనీల నుంచి వసూలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

రైతులను మోసగించడమే..
ఉచిత పంటల బీమాను ఎత్తివేసి రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపారు. రైతుల నుంచి బలవంతంగా ప్రీమియం వసూళ్లు చేశారు. తీరా ఈ పంట డేటాతో పోలిస్తే సగం మందికి పంటల బీమా పరిధిలోకే రాలేదు. వారు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పలేకపోతుంది.  వడ్డీతో సహా ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి.– పీ జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement