కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం చంద్రబాబు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉద్ఘాటన
రెండు శతాబ్దాల రాజమహేంద్రవరం న్యాయ ప్రస్థానానికి ఘన వేడుక
జిల్లా కోర్టుకు 222, బార్ అసోసియేషన్‌కు 131 వసంతాలు
వేడుకల్లో పాల్గొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం న్యాయ ప్రస్థానం చరిత్రాత్మకం.. స్ఫూర్తిదాయకం
ట్రయల్ కోర్టులే న్యాయవ్యవస్థకు పునాది
క్షేత్రస్థాయిలో న్యాయ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి
న్యాయం గెలవాలి.. ధర్మం విజయం సాధించాలి
జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్ వార్షికోత్సవాల్లో న్యాయమూర్తుల సందేశం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెండు శతాబ్దాలుగా న్యాయ సేవల రంగంలో రాజమహేంద్రవరం చెరగని ముద్ర వేసిందని సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల ప్రస్థానం న్యాయవ్యవస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వార్షికోత్సవాలు శనివారం ఇక్కడ ఘనంగా జరిగాయి.
రాజమహేంద్రవరం జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్ వార్షికోత్సవాల్లో ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ వెంకట నారాయణ భట్టి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ సునీతా గంధం, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. న్యాయ చరిత్రలో రాజమహేంద్రవరం ఒక కీలక మైలురాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు అసలైన బలమని, ట్రయల్ కోర్టులను బలోపేతం చేయడం ద్వారానే సామాన్యులకు సత్వర న్యాయం అందుతుందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సత్యాన్వేషణకు తర్కమే మార్గం
సత్యాన్ని తెలుసుకోవడానికి తర్కం, సమర్థవంతమైన వాదనలే ప్రధాన మార్గాలు. న్యాయవాద వృత్తిపై నాకు అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. మరో జన్మంటూ ఉంటే తిరిగి న్యాయవాదిగానే జన్మించాలని కోరుకుంటున్నా. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలనలో పరాధీన ప్రజలుగా ఉన్న మనం స్వతంత్ర, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశ పౌరులుగా మారాం. న్యాయవాద వృత్తిలో అత్యంత కీలకమైన విలువ స్వాతంత్య్రం. ‘నేను, నాది’ నుంచి ‘మనం, మనది’ అనే భావన వైపు సమాజాన్ని నడిపించే వారధులు న్యాయవాదులు. భారత రాజ్యాంగం ‘మేము, భారత ప్రజలం’ అనే పదాలతోనే ప్రారంభమవుతుంది. ‘సత్యమేవ జయతే’ అనే ఆదర్శం సార్థకం కావాలంటే సత్యాన్వేషణ ప్రక్రియలో తర్కానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. – జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
క్షేత్రస్థాయి న్యాయ ప్రక్రియను బలోపేతం చేయాలి
ట్రయల్ కోర్టులే న్యాయవ్యవస్థకు పునాది. క్షేత్రస్థాయిలో న్యాయ ప్రక్రియను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. యువ న్యాయమూర్తులు సీనియర్ న్యాయమూర్తుల అనుభవాలు, మార్గదర్శకత్వం నుంచి నేర్చుకుంటూనే తమ ప్రతిభ, సామర్థ్యాలకు అనుగుణంగా సొంత శైలిని అభివృద్ధి చేసుకోవాలి. నేను, జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ వంటి వారమంతా ట్రయల్ కోర్టుల్లో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసినవారమే. అక్కడ పొందిన అనుభవంతోనే ఉన్నత న్యాయస్థానాలకు ఎదిగాం. ప్రజలు న్యాయవ్యవస్థ నుంచి ప్రధానంగా ఐదు అంశాలను ఆశిస్తారు. సత్వర న్యాయం, అందుబాటులో ఉండే న్యాయం, అర్థమయ్యే తీర్పులు, గౌరవప్రదమైన వ్యవస్థ, నిష్పక్షపాత న్యాయం. న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం మరింత పెరగాలంటే ఈ ఐదు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. – జస్టిస్ వెంకటనారాయణ భట్టి,సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సామాన్య ప్రజల విశ్వాసానికి ప్రతీక
రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం, బార్ అసోసియేషన్ విశిష్ట ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశ న్యాయవ్యవస్థకు గర్వకారణం. రెండు శతాబ్దాలకు పైగా న్యాయవ్యవస్థ కొనసాగడం అనేది కేవలం సంస్థల చరిత్ర మాత్రమే కాదు.. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే లక్షలాది మంది సామాన్య ప్రజల విశ్వాసానికి ప్రతీక. రెండు శతాబ్దాల న్యాయవ్యవస్థ ప్రస్థానాన్ని స్మరించుకుంటున్న ఈ తరుణంలో న్యాయస్థానాల గడప తొక్కే సామాన్య ప్రజల విశ్వాసాన్ని గుర్తుచేసుకోవడం అత్యంత ముఖ్యం. న్యాయస్థానాల్లో నిజం గెలుస్తుందనే విశ్వాసంతోనే వారు న్యాయం కోసం వస్తారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే సంస్థల అసలైన బలం. ఇంతటి ఘన వేడుకల్లో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. చివరిగా ఒక్కటే ఆకాంక్షిస్తున్నా.. న్యాయం గెలవాలి.. ధర్మం విజయం సాధించాలి.– జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రభుత్వం నుంచే కోర్టుల్లో అత్యధిక లిటిగేషన్లు
రాజమండ్రి బార్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కోర్టులు సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచే కోర్టుల్లో అత్యధిక లిటిగేషన్లు ఉంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రభుత్వ శాఖల నుంచి లిటిగేషన్లు లేకుండా చేసే కార్యక్రమాన్ని తీసుకువస్తాం. లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్‌మెంట్ కోసం లీగల్ ఏఐ స్టాక్‌ను కూడా త్వరలోనే అమలు చేయాలని నిర్ణయించాం. తాటి ఆకులపై తీర్పుల ప్రతులు రాసే కాలం నుంచి కృత్రిమ మేధ (ఏఐ) వరకు న్యాయవ్యవస్థ రూపాంతరం చెందింది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ మాదిరిగానే రాజకీయ ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ కూడా ప్రజల హక్కుల కోసం పనిచేస్తోంది. – ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
రాజమహేంద్రవరంలో ప్రాక్టీస్ చేసిన రోజులు స్వర్ణయుగం
జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసిన రోజులు నా జీవితంలో స్వర్ణయుగంలాంటివి. ఇటువంటి వేడుకలు సంస్థల చరిత్రను మాత్రమే కాకుండా, వాటి ద్వారా సమాజానికి అందించిన సేవలను కూడా గుర్తుచేసుకునే సందర్భాలు. రాజమహేంద్రవరం నాకు రెండో ఇల్లులాంటిది. కార్యక్రమానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు ఆహ్వానించడంతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇక్కడ న్యాయవాదులతో గడిపిన రోజులు, బార్‌రూమ్‌లోని ఆత్మీయత, సోదరభావం, పరస్పర గౌరవం జీవితాంతం గుర్తుండిపోతాయి. బార్‌రూమ్ న్యాయవాదుల ఆలోచనలు, అనుభవాలు, సామాజిక, రాజకీయ చర్చలకు వేదికగా నిలుస్తుంది. చారిత్రక ప్రముఖులు నెలకొల్పిన విలువలు, వారసత్వం భావితరాలకు స్ఫూర్తినిస్తాయి. త్వరలో జరగనున్న 225వ వార్షికోత్సవ వేడుకకు కూడా హాజరవుతాను. – సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా


