ఎన్నికల అధికారులకు స్వీయ రక్షణ కవచాలు | Personal protective gear for election officials | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారులకు స్వీయ రక్షణ కవచాలు

Nov 29 2026 3:18 AM | Updated on Nov 29 2026 3:18 AM

Personal protective gear for election officials

ఎన్నికల అధికారుల కార్లపై హెల్మెట్, కర్ర, మైక్‌లు

ప్రాణభయంతో వణికిపోతున్న ఎన్నికల సిబ్బంది 

బాపట్ల జిల్లాలో ఏకంగా 750 మంది గైర్హాజరు 

రౌడీ మూకలు దాడులకు తెగబడుతున్నారని వాపోయిన ఆర్వోలు  

కార్లలో హెల్మెట్, కర్ర, మైక్‌ పెట్టుకోవాలని మౌఖిక ఆదేశాలు 

కొనుగోలు చేసి గ్రూపుల్లో పోస్టు చేస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలంటే ఒక పండగ వాతావరణం. బాపట్ల జిల్లాలో జరుగుతున్న ‘స్థానిక’ ఎన్నికల విధులకు హాజరు కావాలంటేనే అధికారులు, ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. క్షేత్ర స్థాయిలో వెన్నుపోటు పార్టీ కూటమి నేతల దౌర్జన్యాలు, దాడుల భయంతో ఏకంగా 750 మంది ఉద్యోగులు, అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరు కావడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇచ్చినట్టు చెబుతున్న ‘ఆత్మ రక్షణ’ మౌఖిక ఆదేశాలు ఇప్పు­డు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

ఆత్మరక్షణకు హెల్మెట్, కర్ర... 
ఎన్నికల విధులకు గైర్హాజరైతే సహించేది లేదని స్పష్టం చేసిన ఉన్నతాధికారులు, సి­బ్బందికి వినూత్న రీతిలో ‘రక్షణ’ సూచనలు చేసినట్టు తెలిసింది. పోలింగ్, కౌంటింగ్‌ సమయంలో గొడవలు జరిగితే ఆత్మరక్షణ కోసం ఆర్వోలు, పోలింగ్‌ అధికారులు తలకు హెల్మెట్‌ ధరించాలని, అప్పటికీ దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటే కర్రను ఉపయోగించేలా తమ కార్లలో హెల్మెట్, కర్ర, తోపాటు మైక్‌లను ఏర్పాటు చేసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంతేగాకుండా వాటిని కొనుగోలు చేసి  వెంటనే ఫొటోలు తీసి పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులంతా తమ కార్లపై హెల్మెట్, కర్ర, మైక్‌లను పెట్టి ఫొటోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసినట్టు చెప్పుకుంటున్నారు. 

భయం గుప్పెట్లో సిబ్బంది.. 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెన్నుపోటు పార్టీ కూటమి నేతలు బరితెగించి నామినేషన్లు అడ్డుకోవడం ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ్‌లకు పాల్పడడం, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్‌సీపీ గెలుపొందిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినట్టు ప్రకటించాలని అధికారులపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే తమకు రక్షణ ఉండదనే భయంతో ఉద్యోగులంతా విధులకు దూరంగా ఉంటున్నారని ఆర్వోలు బాపట్ల జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. 

కలెక్టర్‌ సీరియస్‌.. 
బాపట్ల జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు ఏకంగా 750 మంది ఉద్యోగులు గైర్హాజరు కా­వడంతో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సీరియస్‌ అయ్యా­రు. వారందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఉద్దేశ పూర్వకంగా గైర్హాజరైతే సస్పెండ్‌ చేయాలని  ఆదేశించారు. అయితే అల్లరి మూకల దాడులను సాకుగా చూపితే సహించేది లేదన్నారు. సిబ్బందిలో ఆత్మస్దైర్యం నింపేందుకు చర్యలు చేపట్టారు. 

మైక్‌లు పెట్టుకుని తిరగమన్నాం 
అధికారులు ఆత్మ రక్షణ కోసం కర్రలు, హెల్మెట్‌లు పెట్టుకుని తిరగమని చెప్పారట కదా అని బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా దాన్ని దాట వేసిన ఆయన మైక్‌లు పెట్టుకుని ఆర్వోలను తిరగమన్నామని సమాధానం చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement